భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్త కుంభమేళలో దళిత సాధువులతో కలిసి క్షిప్రా నదిలో స్నానాలు చేసారు. ఆ తరువాత అయన వారితో కలిసి సహా పంక్తి భోజనాలు కూడా చేసారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్ధి రోహిత్ మృతి, డిల్లీలో జె.ఎన్.యు దళిత విద్యార్ధి కన్నయ కుమార్ అరెస్ట్ తరువాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా భాజపా, మోడీ ప్రభుత్వం దళితుల పట్ల చులకనగా, అనుచితంగా వ్యవహరిస్తోందనే అపవాదు మూటగట్టుకొంది. పైగా ఇప్పుడు ఎన్నికల సమయం కూడా. కనుక తమపై పడిన దళిత వ్యతిరేక ముద్రను చెరిపి వేసుకోవడానికే అమిత్ షా దళిత సాధువులతో కలిసి ‘సమరసతా స్నానాలు, సమరసతా భోజన కార్యక్రమాలు’ పెట్టుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. ఇది దళితులను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేనని అర్ధమవుతూనే ఉంది. దళిత సాధువులతో కలిసి స్నానాలు, భోజనాలు చేసినంత మాత్రాన్న దళితులను గౌరవిస్తున్నట్లేనని భాజపా భావించవచ్చు కానీ అది వారిని మరింత అపహాస్యం చేయడమే.
భాజపాపై ఇప్పటికే మతతత్వ పార్టీ అనే ముద్ర ఒకటి ఉంది. ఆ హిందుత్వ ముద్రే దాని బలం, బలహీనత కూడా. హిందుత్వ ముద్రతో అది ఎప్పటికీ రాజకీయంగా లబ్ది పొందగలదా లేదా అనే విషయాన్ని పక్కనపెట్టి, దాని హిందుత్వంలో దళితులు, బిసిలు తదితరులకు సముచిత స్థానం ఉందా లేదా అని ఆలోచించుకొంటే మంచిది. సెంట్రల్ యూనివర్సిటీ, జె.ఎన్.యు ఘటనల తరువాత దళిత వ్యతిరేకి అనే ముద్ర కూడా సంపాదించుకొంది. కనుక దేశంలో అన్ని కులాలు, వర్గాలు, మతాల ప్రజలకు చేరువయ్యేవిధంగా భాజపా తన వైఖరిని మార్చుకోవడం చాలా అవసరం. దేశంలో దళితులు, మైనార్టీలు తదితరులను కూడా సమాజంలో అందరితో సమానంగా గౌరవిస్తూ వారి సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నాలు చేస్తే ఇటువంటి కార్యక్రమాల అవసరం ఉండదు కదా?