ప్రాంతీయ పార్టీల ప్రభావం జాతీయ స్థాయిలో అంతగా ఉండదని ఈజీగా తీసి పారేశారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పార్టీల నేతలు కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతారనీ, ఆ పరిధి దాటి వారి ప్రభావం ఉండదన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒడిశాలో ప్రచారం చేస్తే ఎవరైనా ఓట్లు వేస్తారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను పశ్చిమ బెంగాల్ పంపించి ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదన్నారు! ఆయా ప్రాంతాల్లో వీరు బలమైన నాయకులు కావొచ్చు, అంతమాత్రాన వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభావం ఉంటుందని అనుకోవడం సరైంది కాదన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఏకమైనా జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేవనే సూత్రీకరణ చేశారు అమిత్ షా! ఆ తరువాత, నాలుగేళ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలను వల్లెవేశారు.
ఇతర ప్రాంతీయ పార్టీల సంగతేమోగానీ, టీడీపీ, తెరాసలతో భాజపాకి కొంత తలనొప్పి ఉందనేది వాస్తవం. అందుకే, ఏరికోరి మరీ కేసీఆర్, చంద్రబాబుల పేర్లు ఊటంకించి అమిత్ షా మాట్లాడారు. నిజానికి, కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారు భాజపాకి వ్యతిరేకంగా ఓటేసిన మాట వాస్తవం. టీడీపీ పిలుపుతో అక్కడ స్థిరపడ్డ తెలుగువారిలో కొంత కదిలక వచ్చింది. సరే, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య జాతీయ రాజకీయాల గురించి ప్రముఖంగానే మట్లాడుతున్నారు. అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం చేస్తాననీ, అవసరమైతే ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అవుతానని నిన్నటి మహానాడులో చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రయత్నం ఏపీ హక్కుల సాధన దిశగానే ఉన్నా, ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక శక్తులను ఒక గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నంగానూ దీన్ని చూడాలి. ఇక, కేసీఆర్ విషయానికొస్తే… ఇప్పటికే ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మమతా బెనర్జీ, దేవెగౌడ వంటి కీలక నేతలో భేటీ అయ్యారు.
భాజపాని ఎదుర్కోవడం కోసం ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతకు అవకాశం పుష్కలంగా ఉందనేది మొన్నటికి మొన్న బెంగళూరులో స్పష్టమైంది. కాబట్టి, ఇప్పట్నుంచే ఆ కలయికకు ఆస్కారం లేకుండా, మానసికంగా దెబ్బతీయాలనే మిషన్ లో భాగంగానే అమిత్ షా ఇలా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఆయా రాష్ట్రాలకే పరిమితం కావొచ్చు. కానీ, వారి ఉమ్మడి లక్ష్యం భాజపాతో పోరాటం అనుకున్నప్పుడు… అది జాతీయ స్థాయి ఐకత్యకు పునాది అవుతుంది. ఆ ప్రభావం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుంది. ఈ లాజిక్ అమిత్ షాకి తెలుసు కాబట్టి, ఆ ప్రయత్నంలో ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారంతే..!