దక్షిణాది వారిని ఎలా ఆకట్టుకోవాలన్న అంశంపై బీజేపీ అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. అమిత్ షా , జేపీ నడ్డాలు దక్షిణాదిలో ఒకరి తర్వాత ఒకరు తిరుగుతున్నారు. విచిత్రమైన ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో జరిగిన బహిరంగసభల్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తమిళ ప్రధాని రావాలనేది తన కోరికని అక్కడ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోని వారు లేరు. ఉన్నంత కాలం ప్రధాని మోదీ ఉంటారు.. ఆయన తర్వాత అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి వారు రేసులో ఉంటారు కానీ మరో దక్షిణాది నేత ఉండరు.
అంతో ఇంతో బీజేపీలో ఉన్నత స్థానానికి వెళ్లిన వెంటనే వెంకయ్యనాయుడు వీలైనంత త్వరగానే ఇంటికి పంపించారు. ఇప్పుడు దక్షిణాది నుంచి బీజేపీకి కీలకమైన నేత లేరు. బీజేపీ మిత్రపక్షాలను ప్రధానిగా చేసేంత పరిస్థితి లేదు. అయితే దక్షిణాది ప్రజల్ని ముఖ్యంగా.. తమిళుల్ని ఆకట్టుకోవడానికి ఆయన ప్రధాని పదవి ప్రస్తావన తీసుకు వచ్చారు. అదే రోజు ఏపీలోనూ ఆయన బహిరంగసభలో మాట్లాడారు. కానీ ఇక్కడ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తెలుగు వారు ప్రధాని కావాలని తన లక్ష్యం అని ఆయన చెప్పుకోలేదు.
రాష్ట్రం విడిపోయి నతర్వాత తెలుగు వారి మధ్యే పోటీ ఏర్పడింది. ఈ కారణంగా ఆయన… ఏపీలో అలాంటి సెంటిమెంట్లు అవసరం లేదని భావించారని అనుకోవచ్చు. ప్రధాని పదవి పేరిట తమిళుల్ని ఆకట్టుకోవాలని అమిత్ షా ప్రయత్నించారు కానీ…. సమీప భవిష్యత్లో దక్షిణాదికి ప్రధానమంత్రి పదవి కాదు కదా.. కనీసం రాష్ట్రపతి పదవి కూడా వచ్చే అవకాశం లేదన్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయినా .. అమిత్ షా దక్షిణాది ప్రజల్ని ఆశ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.