భారతీయ జనతా పార్టీ .. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థపై ఆషామాషీగా గురి పెట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఉంది. బీజేపీ బలపడిందనే సూచనలు కనిపిస్తూండటంతో… ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతోంది. ప్రచారానికి మొత్తం వారం రోజులే గడువు ఉంది. ఈక నాలుగు రోజులే ఉంది. ఇలాంటి సమయంలో రోజుకో స్టార్ క్యాంపెయినర్ హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అమిత్ షా కూడా ఉన్నారు. ఇప్పటికే తేజస్వి సూర్య వచ్చారు. స్మృతి ఇరానీ వచ్చి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలు కూడా రాబోతున్నారు బీజేపీ లైనప్ చూస్తే… అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో.. వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
ఇక హిందూత్వ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ గరిష్ట స్థాయిలో వాడుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల దుమారం రేగింది. ఈ నినాదంతో హిందువుల ఓట్లను సమైక్యం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో.. ఇతర వర్గాల్లో అలజడి రేపి.. ప్రశాంతమైన నగరం కోరుకునేవారి ఓట్లను పొందాలని టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. ఎవరి స్కెచ్ వర్కవుట్ అవుతుందోకానీ.. ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్లో హిందూత్వ నినాదం తెరపైకి బలంగా వచ్చింది. మత ప్రాతిపదికన రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూలేదు.
భారతీయ జనతా పార్టీ ఎక్కడ రాజకీయంగా ఎదిగినా.. అక్కడ హిందూత్వ నినాదం బలంగా వెళ్లూనుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో అదే జరుగుతోందని అనుకోవాలి. బీజేపీ నేతలు.. హైదరాబాద్ అంశంపై ఢిల్లీలో ప్రత్యేకంగా కార్యాచరణ ఖరారు చేసుకుని రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. అమిత్ షా హైదరాబాద్ వచ్చి వెళ్తే… ఆ తర్వాత పరిస్థితి మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఒకటో తేదీనే పోలింగ్ కాబట్టి… ఈ మధ్యలోనే చాలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.