రాజ్యసభలో సీఎం రమేష్ రచ్చ చేశారు. సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు రాజ్యసభలో పాస్ అవడంలో.. సీఎం రమేష్ కీలకపాత్ర పోషించారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. పైగా విపక్ష పార్టీలన్నీ… నేరుగా ఆర్టీఐ చట్టాన్ని సవరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందరూ.. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఓటింగ్ ప్రారంభమయ్యే సమయానికి.. బీజేపీలో చేరిన.. టీడీపీ నేత సీఎం రమేష్.. చక్రం తిప్పేశారు. ఇతర పార్టీలకు చెందిన ఎంపీలతో.. బిల్లుకు మద్దతుగా ఓటేయించడంలో కీలక పాత్ర పోషించారు. పరువురు సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి… బిల్లు తరపున అనుకూలంగా ఓటింగ్ చేయించి… తనే స్వయంగా ఆ సిప్పులను తీసుకుని..రాజ్యసభ సిబ్బందికి అందించారు.
ఈ క్రమం కాంగ్రెస్ నేతృత్వంలోని పలువురు విపక్ష పార్టీల ప్రతినిధులు..సీఎం రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్దతని ప్రశ్నించారు. పలువురు.. సీఎం రమేష్ చేతుల్లోని స్లిప్పులు లాగేసుకునేందుకు కూడా ప్రయత్నించారు. కానీ సీఎం రమేష్ చాన్సివ్వలేదు. ఆయన హడావుడి చేసి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా… కంగారు పడిపోయారు. సీఎం రమేష్ తన కుర్చీలో కూర్చోవాలని … రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదే పదే సీఎం రమేష్‌ను కోరాల్సి వచ్చింది. చివరికి బిల్లులో సవరణకు మద్దతుగా 117 మంది రాజ్యసభ సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 75 మంది మాత్రమే ఓటు వేశారు. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు కూడా… బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంలో సీఎం రమేష్ కీలకపాత్ర పోషించారు.
ఇంత ఈజీగా..రాజ్యసభలో… ఆర్టీఐ చట్టం బిల్లు పాస్ అవుతుందని… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఊహించలేకపోయారు. అందుకే.. సీఎం రమేష్‌ను అమిత్ షా, పీయూష్‌గోయల్, పలువురు ఎంపీలు ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై.. ఇటీవలే బీజేపీలో చేరిన సీఎం రమేష్.. హైకమాండ్ వద్ద…మొదట్లోనే మంచి మార్కులు పొందారని.. ఇతర బీజేపీ నేతలు ప్రశంసలు గుప్పించారు. టీడీపీలో వ్యూహకర్తగా పేరున్న సీఎం రమేష్.. బీజేపీలోనూ అదే పాత్ర పోషించడానికి తనకు సామర్థ్యం ఉందని..రాజ్యసభ వేదికగా నిరూపించారంటున్నారు.