కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. అమిత్ షాను అనారోగ్యం వదిలి పెట్టడం లేదు. హఠాత్తుగా ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తోంది. అయితే.. అమిత్ షా బాగానే ఉన్నారని ఆయన ఆస్పత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నారని మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. దేశంలో కరోనా నియంత్రణ విషయంలో వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అమిత్ షా రేయింబవళ్లు పనిచేశారు. ఢిల్లీ లాంటి చోట్ల.. కరోనా కట్టడికి ఆయన వ్యూహాలు ఫలించాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇతర పెద్ద రాష్ట్రాలపై ఆయన దృష్టి పెట్టే సమయానికి ఆయనకు పాజిటివ్ వచ్చింది.
స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. దాదాపుగా పది రోజులపాటు చికిత్స పొందిన తర్వాత ఆయనకు నెగెటివ్ వచ్చింది. స్వయంగా అమిత్ షా నెగెటివ్ వచ్చిన విషయాన్ని ప్రకటించి సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఆయన డిశ్చార్జ్ అయిన మూడు రోజులకే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. శ్వాస తీసుకోడం ఇబ్బందికరంగా మారింది. దీంతో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హుటాహుటిన ఎయిమ్స్‌లో చేర్పించారు.
కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. శరీరంలో బలహీనంగా వ్యవస్థలపై అది దాడి చేస్తోందని ఇటీవలి కాలంలో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో చికిత్స కోసం… ఆస్పత్రిలో చేరడం మంచిదని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అమిత్ షా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. ముందస్తు జాగ్రత్త కోసమే ఎయిమ్స్‌లో చేరారని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.