పశ్చిమ బెంగాల్ లో పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు దక్కించుకోవడంపై భాజపా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే, ఆ రాష్ట్రం మీద మోడీ షా ద్వయం ఫోకస్ పెట్టి… పెద్ద ఎత్తున ర్యాలీలూ సభలూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో… భాజపా దూకుడును అడ్డుకోవడం కోసం సీఎం మమతా బెనర్జీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి దక్షిణాదిలో భాజపా పెద్ద సంఖ్యలో సీట్లు కోల్పోయే వాతావరణం ఉందనే అంచనాలున్నాయి కాబట్టి, బెంగాల్ లో ఆ మేరకు నష్టాన్ని కొంత భర్తీ చేసుకునే వ్యూహంలో అమిత్ షా ఉన్నారు. అందుకే, అక్కడి ప్రచారంలో దేశభక్తి, మతం కార్డులను ప్రయోగిస్తున్నారు.
బెంగాల్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న అమిత్ షా ప్రస్తుతం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం… జై శ్రీరామ్! తాజాగా ఒక సభలో ఆయన మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్ ప్రజలు జై శ్రీరామ్ అనేందుకు కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమతించడం లేదని విమర్శించారు. రాముడు మనదేశ సంస్కృతిలో భాగమనీ, మమతా దీన్ని కాదంటారా అమిత్ షా ఆవేశంగా ప్రశ్నించారు. శ్రీరాముడు పేరును భారతీయులు పలకకుండా ఎవరైనా అడ్డుకోగలరా అంటూ సవాల్ చేశారు! రాముడి పేరును భారతదేశంలో జపించకుండా, పాకిస్థాన్ లో వినిపించాలా… ఈ ప్రశ్నకు మమతా బెనర్జీ జవాబు చెప్పాలంటూ అమిత్ షా ఉద్వేగంతో అన్నారు. మమతాకి దమ్ముంటే తనను జైల్లో పెట్టొచ్చని షా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో రామనామ జపం ప్రధాన అజెండా కాదు కదా! కానీ, అమిత్ షా ఆవేశం చూస్తుంటే… అదే ప్రధానాంశంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్ల మోడీ పాలన ఎలాగుందో ప్రజలకు చెప్పి, మరోసారి ఓటు అడగాల్సింది పోయి… శ్రీరాముడు పేరు జంపించకూడదా, పాకిస్థాన్ లో జంపించాలా అంటూ అమిత్ షా మాట్లాడటం అసందర్భం. శ్రీరాముడు భారతీయ సంస్కృతిలో భాగం కాదని ఎవరూ అనడం లేదే. అమిత్ షా ఇంత ఆవేశానికి లోనై ప్రసంగించడంలోనే వారి అంతరార్థమేంటో అర్థమైపోతోంది. గడచిన ఐదేళ్లలో మోడీ మార్కు పాలనవైపు ప్రజల ఆలోచన వెళ్లనీయకుండా, ఈ తాత్కాలిక భావోద్వేగాల అంశాలతో హీట్ పెంచి, ఓట్ల తతంగాన్ని గట్టెక్కించేద్దాం అనేది భాజపా వ్యూహం.