ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రకు ఆదిలోనే హంసపాదు పడిన సంగతి తెలిసిందే. మోడీ సర్కారు రాష్ట్రానికి చాలా ఇచ్చిందనీ, దాన్ని ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్తే చాలని కమలనాథులు భావించారు. అందుకే, అత్యంత ప్రతిష్టాత్మకంగా బస్సు యాత్ర ప్రారంభించడానికి పలాసాకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చారు. అయితే, సభా ప్రాంగణంలో సగ భాగాన్నైనా జనంతో నింపలేకపోయింది రాష్ట్ర నాయకత్వం. దీంతో పలాస సభ ముగియగానే రాష్ట్ర నేతలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జాతీయ నేతలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా అంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా పార్టీ వర్గాల్లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పలాస ప్రభావం ఇప్పుడు గుంటూరులో ప్రధాని మోడీ పర్యటనపై స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 10న మోడీ గుంటూరు సభకు రావాల్సి ఉంది. ఈ సభను పెద్ద సక్సెస్ చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పట్టుదలగా ఉన్నారట. కన్నా సొంతూరికే మోడీ రాబోతున్నారు కదా! అయితే, ప్రధాని సభకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నా… అమిత్ షా తిరిగి వెళ్లాక పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి సమాచారం కన్నాకు అందలేని పార్టీ వర్గాల్లో కొంతమంది చెబుతున్నారు. అధినాయకత్వంతో కన్నా మాట్లాడారనీ, ప్రధానమంత్రి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారని తెలుస్తోంది.
పెద్ద సంఖ్యలో జనాల్ని తీసుకొచ్చే బాధ్యత తనది కన్నా నమ్మకంగా చెప్తున్నా, జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో నమ్మడం లేదనీ సమాచారం! టీడీపీని సమర్థంగా ఎదుర్కొంటామనీ, చంద్రబాబు అవినీతి పాలనను అంతం చేస్తామంటూ పెద్దపెద్ద ప్రకటనలు చేసే ఏపీ నాయకులు… జాతీయ నేతల సభల్ని కూడా సక్సెస్ చేసుకోలేకపోతున్నారనే చర్చ ఢిల్లీ భాజపా వర్గాల్లో జరుగుతోందని తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని సభ అనుకున్న ప్రకారం నిర్వహించినా… జన సమీకరణ కచ్చితంగా కన్నాకి సవాల్ గానే మారుతుంది. ఏపీలో రాజకీయంగా భాజపా సాధించేది ఏం లేదనేది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. రాష్ట్రానికి ఏమీ చెయ్యకుండా… ఏదో చేశామని ప్రచారాలు చేస్తే నవ్వడానికి తప్ప, నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరనేది పదేపదే నిరూపితమౌతూనే ఉంది.