అంతన్నారు, ఇంతన్నారు.. అదిగో ఇదిగో అందరూ వచ్చేస్తున్నారు అన్నారు! కానీ, చివరికి వాస్తవంలో జరిగిందేదీ లేదు. తెలంగాణ భాజపాలోకి నాయకులు క్యూ కట్టేస్తారనీ, కాంగ్రెస్ నుంచి కొంతమంది వచ్చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చాలానే చెప్పారు. ఆ మధ్య నిజామాబాద్ లో జరిగిన సంక్పల్ సభలో రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో డీఎస్ కుమారుడు అరవింద్ తోపాటు ముగ్గురు నేతలు భాజపాలో చేరారు. నిజామాబాద్ నుంచి మొదలైన చేరికలు, అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఉంటాయని భావించారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు చేరికలకు కాంగ్రెస్ కొత్త కేరాఫ్ గా కనిపిస్తోంది. తెలంగాణలో మారిన పరిస్థితులపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీసినట్టు సమాచారం. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ, కాంగ్రెస్ టీడీపీల్లో అసంతృప్తిగా ఉంటున్న నేతల్ని పిలుస్తున్నామని.. ఆయన సమక్షంలోనే కాషాయ కండువాలు కప్పే కార్యక్రమం ఉంటుందని పలికిన రాష్ట్ర నేతలపై అమిత్ షా కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఎంతో ఆశాజనకంగా కనిపించిన పార్టీ భవిష్యత్తు, గడచిన నెలరోజుల్లోనే ఎందుకిలా మారిందని రాష్ట్ర నేతలను ఆయన వివరణ కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇకనైనా ఆకర్ష్ వేగం పెంచాలంటూ కొత్త లక్ష్యాన్ని రాష్ట్ర నేతలకు నిర్దేశించినట్టు సమాచారం. ఈ నెల నుంచే పని మొదలుపెట్టి, వచ్చే నెలల్లో ఒకేసారి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉండేలా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాలంటూ జాతీయ నేతలు ఉద్బోధించినట్టు తెలుస్తోంది. ఓపక్క తెరాస, కాంగ్రెస్ లు దూసుకుపోతున్నాయనీ, ఈ రేసులో వెనకబడకూడదని ఢిల్లీ పెద్దలు సూచించినట్టు చెబుతున్నారు. జిల్లా స్థాయిలో పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, దీంతోపాటు వచ్చే నెలలో కనీసం ఇద్దురు లేదా ముగ్గురైనా పేరున్న నాయకుల్ని పార్టీలోకి తీసుకొస్తే మరోసారి భాజపా హాట్ టాపిక్ గా మారుతుందన్నది జాతీయ నేతల వ్యూహంగా చెబుతున్నారు.
అన్ని రాష్ట్రాల్లోనూ అమిత్ షా వ్యూహం వర్కౌట్ అయింది, కానీ తెలంగాణకు వచ్చేసరికి ఎక్కడో లెక్క తప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో రాష్ట్ర నేతల్ని బాగా ప్రోత్సాహించారు. కానీ, జిల్లా స్థాయి నాయకత్వం ఈ అంశాన్ని సీనియర్ తీసుకోలేదనే విషయాన్ని ఇప్పుడు ఆలస్యంగా గుర్తించారు. కొత్తగా నాయకులు వస్తే తమకు గుర్తింపు తగ్గిపోతుందన్న ఆలోచన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో బాగా ఉంది. అందుకే, కొత్తవారి చేరికలపై వారు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ వాస్తవం ఇప్పుడు బోధపడింది. అయితే, ఈలోగా పుణ్యకాలం కాస్తా పూర్తైపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో.. ఇకపై చేరికలంటూ ఉంటే తెరాస, కాంగ్రెస్ పార్టీల్లోకి మాత్రమే అన్నట్టుగా ప్రస్తుత వాతావరణం కనిపిస్తోంది. మరి, కొత్తగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వచ్చే నెలలో ఏస్థాయిలో చేరికలు ఉంటాయో చూడాలి.