వినడానికి విచిత్రంగా వున్నా ఇది నిజమే. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో పాలకపార్టీలు అనుసరించే ఎత్తుగడలు ఒకేలా వుంటాయి మరి. ప్రపంచంలోనే మొదటి కమ్యూనిస్టు మంత్రివర్గంగా పేరొందిన ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ అద్యక్షురాలి హౌదాలో ‘విమోచనయాత్ర’చేశారు. ప్రధానిగా వున్న ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఆమె ఫిర్యాదులపై కేరళ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలపై దాడికి అది ఆరంభం అని చెప్పొచ్చు. ఇప్పుడు బిజెపి అద్యక్షుడు అమిత్ షా కూడా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్వస్థలమైన పయ్యన్నూరు నుంచి జన రక్షణ యాత్ర అంటూ ప్రారంభించారు. ఆరెస్సెస్ సిపిఎం కార్యకర్తల మధ్య సాగుతున్న హత్యాకాండ నేపథ్యంలో తమ వాదనలు చెప్పడం కోసం షా ఈ యాత్ర మొదలుపెట్టారు. జాతీయ పార్టీ అద్యక్షుడు పదిహేనురోజుల పాటు ఒక రాష్ట్రంలోనే యాత్ర చేస్తున్నారంటే రాజకీయంగా ఎంత కీలకంగా భావిస్తున్నారో చెప్పొచ్చు. ఈ సమయంలోనే ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా మరో వైపునుంచి దాడి మొదలెట్టారు. పశ్చిమ బెంగాల్లాగే కేరళ కూడా దేశ వ్యతిరేకులను అడ్డాగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేరళ ప్రజలను అవమానించడమేనని విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా భగవత్ మాటలను తప్పు పట్టింది. అయితే అమిత్ షా పర్యటనలో ఇలాటి మాటలే మరింత తీవ్రంగా వినిపిస్తాయనడంలో నో డౌట్.