హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారిని నియమించవద్దంటూ.. విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని హోంమంత్రి అమిత్ షా మన్నించారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా.. గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధరన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మనోజ్ శశిధరన్.. కేరళకు చెందిన వ్యక్తి. ఐపీఎస్‌గా గుజరాత్ కేడర్‌లో సుదీర్ఘంగా పని చేస్తున్నారు. అమిత్ షా, నరేంద్రమోడీలకు అత్యంత సన్నిహిత అధికారిగా పేరు పొందారు. గుజరాత్ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ సీబీఐ జేడీగా వస్తున్నారు. ఐదేళ్ల పాటు జేడీగా ఉంటారు.
సీబీఐ జేడీగా.. హెచ్.వెంకటేష్ అనే అధికారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. కొద్ది రోజుల కిందట.. విజయసాయిరెడ్డి.. అమిత్ షాకు లేఖ రాశారు. అందులో.. హెచ్.వెంకటేష్ అనే అధికారి.. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ అధికారి.. గతంలో ఎస్పీగా ఉన్నప్పుడు.. జగన్ అక్రమాస్తుల కేసును విచారించారు. ఈ కారణంగానే.. విజయసాయిరెడ్డి మళ్లీ ఆ అధికారి జేడీగా రాకూడదని కోరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ఎంపీ హోదాలో అమిత్ షాకు లేఖ రాసిన.. విజయసాయిరెడ్డి ఆ మేరకు సానుకూల ఫలితం పొందారు. కానీ.. పదకొండు సీబీఐ కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. రాసిన లేఖకు.. అమిత్ షా స్పందించడం.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
ఇప్పుడు.. విజయసాయి రెడ్డి కోరికను మన్నిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందని అధికారిని నియమించారు. అయితే అమిత్ షా నేరుగా.. తనకు సన్నిహితుడైన అధికారినే.. హైదరాబాద్ లో నియమించారు. అంటే.. కేసులు ఎలాంటి మలుపు తిరగాలన్నా.. అది.. ఖచ్చితంగా… సీబీఐ జేడీ చేతుల్లోనే ఉంటుందన్నది ఖాయం. ఈ నియామకం విజయసాయిరెడ్డిని సంతృప్తి పరిచిందో లేదో.. ఆయన స్పందనను బట్టే తెలుస్తుంది.