ఏపీ ప్రభుత్వం కొలువు దీరుతున్న వేదికపై బీజేపీ అంతర్గత రాజకీయాల వ్యవహారం హైలెట్ అయింది. తమిళనాడు మీడియాలో ఇది సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే… వేదికపై అమిత్ షా, వెంకయ్యనాయుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో తమిళిసై వేదికపైకి వచ్చారు. వారికి నమస్కారం పెడుతూ తన కుర్చీ వైపు వెళ్లబోయారు. వారు కూడా ప్రతి నమస్కారం చేశారు కానీ.. ఆ సమయంలో వెంటనే షాకు ఏదో గుర్తు వచ్చింది.
వెళ్లిపోతున్న తమిళిసైని పిలిపించి సీరియస్ గా అలా చేయకూడదన్నట్లుగా చేతులు చూపిస్తూ. మాట్లాడారు. మాట్లాడిన విధానం.. తమిళిసై స్పందనను చూస్తే.. అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని తమిళ మీడియా తేల్చింది. ఎందుకంటే.. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఒక్క సీటు కూడా బీజేపీ గెల్చుకోలేదు. అన్నామలైతో పాటు పోటీ చేసిన తమిళిసై కూడా ఓడిపోయారు. ఫలితాల తర్వాత తమిళిసై.. అన్నామలైపై విమర్శలు చేశారు. ఆయన నోటి దురుసు కారణంగానే సీట్లు రాలేదని విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపైనే అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని..ఏమైనా ఉంటే మీడియాతో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారని తమిళ మీడియా చెబుతోంది. అన్నామలైకి ముందు తమిళిసైనే బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమెను తెలంగాణకు గవర్నర్ గా పంపి అన్నామలైకు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో మరోసారి తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని తమిళిశై ఆశిస్తున్నారు. కానీ అమిత్ షా హెచ్చరికల తర్వాత అలాంటి చాన్సులు తగ్గిపోయాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.