భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వైఖరి ఒక్కరోజులోనే ఎందుకిలా మారింది..? గురువారం నాడు ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో కలిస్తే నిర్లక్ష్యంగా స్పందించారు! ఏపీకి ఇవ్వాల్సినవి గత నెలలోనే ప్రకటన చేశాం, ఇప్పుడు చేయాల్సిందే లేదని కాస్త పొగరుగానే చెప్పి పంపేశారు. సరిగ్గా, ఒక రోజు గడిచేసరికి.. చర్చలకు రండీ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు. అంతలోనే ఇంత మార్పు ఎందుకొచ్చింది..? అది కూడా మార్చి 5 నాడే చర్చలకు రండీ అని ఆహ్వానించడం వెనక మతలబు ఏంటీ..?
శుక్రవారం నాడు టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది. కేంద్రంపై పోరాటం విషయమై టీడీపీ వ్యూహం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇకపై జాతీయ స్థాయిలోనే, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం ద్వారా పోరాటం చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా అన్ని పార్టీలకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతోపాటు ఈనెల 5 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు సమావేశాల్లో నిరసనలు, ధర్నాలు యథావిధిగా కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే సమావేశాల్లో పరిస్థితిని బట్టీ అవసరమైతే కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వినిపిస్తోంది. దీంతో ఈసారి భాజపాపై టీడీపీ ఒత్తిడి గతం కంటే కాస్త తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, టీడీపీ చేయబోయే పోరాటానికి భయపడో ఆందోళన చెందో అమిత్ షా ఫోన్ చేశారని అనుకోలేం! వారికి ఆంధ్రా ప్రయోజనాలుగానీ, ఏపీ ప్రజల తిరుగుబాటుగానీ ఏమాత్రం పట్టవు. మరి, ఇప్పుడీ చర్చలకు ఆహ్వానం ఎందుకంటే… త్వరలోనే కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి కదా! ఇంకోపక్క, పీఎన్బీ స్కామ్ వంటి అంశాలపై జాతీయ స్థాయిలో కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నిరసనకు దిగడం మరింత ఇబ్బందిగా మారొచ్చు. దాన్ని వారించాలంటే… చర్చలకు రమ్మంటూ చంద్రబాబును పిలిస్తే, ఎలాగోలా ఈ సమావేశాలను నెట్టేద్దామన్నది అమిత్ షా వ్యూహం కావొచ్చు. అయితే, ఈ వ్యూహం చంద్రబాబుకు అర్థం కానిదా చెప్పండీ..! అందుకే, ఆయన కూడా అమిత్ షాతో చర్చలకు అంగీకరించారు. కానీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చర్చకు వస్తారని స్పష్టం చేశారు. మరో అంశం కూడా స్పష్టంగానే చెప్పారు! ఆందోళనలు ఆందోళనలే, చర్చలు చర్చలే అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిజానికి, అమిత్ షాతో చర్చలు జరిగినా ఏమీ ఉపయోగం ఉండదనే పరిస్థితే ఇప్పుడు ఉంది. ఏపీ ప్రయోజనాల విషయమై అనూహ్య చిత్తశుద్ధిని భాజపా ప్రదర్శించే అవకాశాలు దాదాపు తక్కువ. ఒకవేళ అదే జరిగే అద్భుతం, ఆహ్వానించదగ్గ పరిణామం.