దేశ యువత భవిష్యత్‌ను పణంగా పెట్టి తమ రాజకీయ భావజాలాలను విస్తృత పరుచుకునేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న వికృత రాజకీయాలు ఊహించని లోతుల్లోకి దిగజారిపోతున్నాయి. తెలుగుమీడియం వద్దు ఇంగ్లిష్ మీడియం ఒక్కటి చాలు అంటూ .. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి ఎన్ని లక్షల మంది పిల్లలు మానసిక వేదనకు గురవుతున్నారో కళ్ల ముందు ఉంది. ఇప్పుడు కేంద్రం మరో నిర్ణయం తీసుకుంటోంది. ఇంగ్లిష్ కూడా వద్దు దేశం అంతా హిందీ మీడియం ఉండాలంటోంది.
కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. విద్యాసంస్థల్లో హిందీ మీడియం మాత్రమే ఉండేలా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరిగేలా.. ప్రతిపాదనలు చేసింది. భారతీయులకు ఇంగ్లీష్‌ని దూరం చేయడమే లక్ష్యంగా.. ఈ ప్రతిపాదనలు చేశారు. అమిత్ షా ఆ కమిటీ మొత్తం 112 సిఫారసులతో.. తన 11వ నివేదికను.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ.. హిందీ మీడియమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్‌ను ఆప్షనల్‌గా మార్చాలని ప్రతిపాదించారు.
దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో విమర్శలు ప్రారంభమయ్యాయి. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని మాత్రమే అమలు చేయాలని నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి సిఫార్సులు కరెక్ట్ కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అన్ని భాషలపై ఒకే సారి వేటు వేయడం లాంటిదేనన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల కోసం మాతృభాషను చంపేసేందుకు రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనుకాడకపోతూండటం… ఈ భాషా రాజకీయంలో అసలు విషాధం.