తెలంగాణాలో భాజపా ప్రత్యమ్నాయ శక్తిగా ఎదగగలదా? అనే ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పదలిస్తే అసాధ్యమేనని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. ఈ రెండేళ్ళలో రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలలోనూ భాజపా గెలవలేకపోయింది. చివరికి తనకి చాలా గట్టి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తెరాస చేతిలో చిత్తుగా చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పార్టీ తరపున పోటీ చేసేందుకు తగినంత మంది అభ్యర్ధులు కూడా దొరకకపోవచ్చు. ఈ విషయం వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల సమయంలోనే తేటతెల్లమయింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ వచ్చే ఎన్నికలలో తన పార్టీకి ఎదురులేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆ దెబ్బకి తెదేపా ఇప్పటికే దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. టీ-కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కనుకనే బహుశః కెసిఆర్ రాష్ట్ర భాజపా జోలికి వెళ్ళడం లేదని భావించవచ్చు. కానీ ఎన్నికల సమీపించినప్పుడు కెసిఆర్ భాజపాని కూడా విడిచిపెట్టకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావడమే ఆయన ప్రాధాన్యం ఇస్తారు తప్ప భాజపాని దెబ్బ తీస్తే కేంద్రం ఏమనుకొంటుందో..అది ఏమి చేస్తుందోనని ఆలోచించరు.
ప్రస్తుతం తెదేపా, భాజపా, కాంగ్రెస్ పార్టీలు మూడూ కలిసి తెలంగాణా ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై, వాటిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ గట్టిగానే పోరాడుతున్నప్పటికీ, వాటివలన ఆ పార్టీలు మళ్ళీ బలం పుంజుకోగలవని ఆశించలేము. ఒకవేళ ఆ పనులలో నిజంగానే అవినీతి జరిగినప్పటికీ ఈ మూడేళ్ళలో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులని పూర్తి చేసి పంటలకి నీళ్ళు అందించగలిగితే, ప్రజలు ఆ అవినీతి ఆరోపణలను కూడా పట్టించుకోకపోవచ్చు.
అయినా కెసిఆర్ వ్యూహాల ముందు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలే చిత్తయిపొతున్నపుడు నోట్లో నాలుకే లేనట్లు మాట్లాడే భాజపా నేతలు ఎదుర్కొని పోరాడి గెలవగలరని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు, కవిత, ఈటెల వంటి తెరాస నేతలకి సాటిరాగల నేతలు తెలంగాణా భాజపాలో లేకపోవడం కూడా ప్రధాన లోపమే. కనుక ఏవిధంగా చూసినా భాజపా తెరాసని డ్డీకొని నిలవగలిగే పరిస్థితిలో లేదని అర్ధమవుతోంది. అటువంటప్పుడు తెరాసకి ప్రత్యామ్నాయంగా ఎదగడం అంటే ఊహించలేని విషయమే.
ఈ పరిస్థితులలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర భాజపా నేతలతో శుక్రవారం డిల్లీలో సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితిపై సమీక్ష, పార్టీని బలోపేతం చేసుకోవడం, వచ్చే ఎన్నికలకి పార్టీని సిద్దం చేయడం అనే మూడు లక్ష్యాలతో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం భాజపాకి రాష్ట్రంలో 17లక్షల మంది సభ్యులున్నారు. మిగిలిన ఈ మూడేళ్ళలో దానిని మరింత పెంచుకోవడం, ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేయడం, మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని వచ్చే ఎన్నికలకి సిద్దం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు.
అయితే తెలంగాణా ప్రజలపై మోడీ ప్రభావం కంటే కెసిఆర్ ప్రభావమే చాలా ఎక్కువగా ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. అలాగే తెలంగాణా ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వంతో పోటీపడి అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు, రాష్ట్ర భాజపా నేతలు మోడీ ప్రభుత్వం గురించి ఎంతగా ప్రచారం చేసుకొన్నా ప్రయోజనం ఉండకపోవచ్చు. పైగా తెలంగాణా పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణలు కూడా రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణా ఏర్పడి రెండేళ్ళవుతున్నా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా రాష్ట్రంలో పర్యటించకపోవడం, హైకోర్టు విభజనకి సహకరించక పోవడమే అందుకు ఉదాహరణలని తెరాస నేతల వాదిస్తున్నారు. నిత్యం విదేశాలలో తిరిగే మోడీ తెలంగాణా రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు? అని కెటిఆర్ ప్రశ్నిస్తుంటారు. వాటికి రాష్ట్ర భాజపా నేతలు వద్ద జవాబే లేదు. కనుక తెలంగాణాలో భాజపాని బలోపేతం చేసుకోవాలంటే అమిత్ షా చాలా చెమటోడ్చవలసి ఉంటుంది.