”పోలవరం ప్రాజెక్టుని మేమే ఇచ్చాం, ముంపు మండలాలు ఏడింటినీ మేమే ఎపిలో కలిపాము. కేంద్రం తగురీతిలో సాయం చేయటం లేదని దుష్ప్రచారం జరుగుతోంది. ఎపి కి కేంద్రం ఏవిధంగా సాయం చేస్తోందో వివరించడానికే నేను ఇక్కడికి వచ్చా” అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం జరిగిన సభలో చెప్పారు.
పాత విషయాలనే హావభావ ప్రకటనలతో గట్టిగా చెప్పడమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బిజెపి పట్ల వున్న ఆశలమీదా, నిరాశలమీదా -కేంద్రప్రభుత్వ పాలకపక్షాలకు సారధ్యం వహిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎలాంటి భరోసాలు ఇవ్వకపోవడం గమనార్హం. కేంద్రబడ్జట్ తరువాత ప్రజల మూడ్ ఎలా వుందో తెలిసి కూడా “అదంతా విరోధి దుష్ప్రచారంగా కొట్టిపారేయడం, సాయాన్ని వివరించడానికే వచ్చానని చెప్పడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రప్రభుత్వం వైఖరి ఇంతేనని సంకేతం ఇచ్చినట్టు స్పష్టమైపోయింది.
రాష్ట్రప్రభుత్వమే బడ్జెట్ కేటాయింపుల్లో అసంతృప్తి వెలిబుచ్చిన నేపధ్యంలో అమిత్ షా ఈ విధంగా బాల్ ఎపి కోర్టు కోర్టులోకి విసిరేశారు.
ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని బలోపేత మైన శక్తిగా మార్చవలసిన బాధ్యత కార్యకర్తలదేనని పిలుపు ఇచ్చారు. సభానిర్వాహకులు ముందుగా చెప్పినట్టు సభలో రెండులక్షల మంది అయితే లేరు. పెద్దసంఖ్యలో 24 గంటల ప్రసారాల న్యూస్ టివిలు వున్నచోట బహిరంగ సభలకు పెద్దగా జనం హాజరు కారు. దీనికి తోడు సామాన్య ప్రజల్లో ఆసక్తి లేకపోతే ప్రజల హాజరు మరీ పల్చబడిపోతుంది. ఈ రెండు ప్రతికూలతలనూ పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినపుడు ఆదివారం రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు జనం గట్టిగా నే వచ్చారని చెప్పాలి.
అమిత్ షా రాక ఆయన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఒక వేడుక వాతావరణమే! అయితే కేంద్రబడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్ కి చట్ట ప్రకారం ఇవ్వవలసిన నిధులు కేటాయింపు దాదాపు ఏమీ లేకపోవడంతో జన సామాన్యంలో ఉత్సుకత చచ్చిపోయింది. మిత్రపక్షమైన తెలుగుదేశంలో మాత్రమే గాక తటస్ధుల్లో కూడా ఈ కార్యక్రమం మీద ఆసక్తి కుతూహలాలు లేకుండా పోయాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సహా రాష్ట్రవ్యాప్తంగా వున్న పార్టీ ప్రముఖులు వేదికపై వున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన అమిత్ షా రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో లంచ్ చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు నివాసంలో టీ తీసుకున్నారు. ఈ ఇద్దరితోపాటు బిజెపి రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు బొమ్మల దత్తు కొద్దిరోజులుగా సభాసన్నాహాలను సమన్వయం చేశారు.
ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యే నివాసంలో బిజెపి జాతీయ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా పలకరించి వెళ్ళిపోయారు.