ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం.. ఎస్ చెబుతున్నారు. రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో సమావేశం అయ్యారు. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తున్నారు. పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా.. తాజాగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్న అమిత్ షా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎందుకు వాయిదాలు వేస్తున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు.
సోమవారం అపాయింట్మెంట్ ఖరారు అయిందని .. సీఎంవోకు సమాచారం ఇచ్చినా… చివరి క్షణంలో మళ్లీ వాయిదా వేశారు. గురువారం లోపు ఇస్తామని సమాచారం పంపారు. ఆ తర్వాత కేంద్రం వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో గురువారం కూడా అమిత్ షాతో భేటీ ఉంటుందో లేదో.. చెప్పలేని పరిస్థితి. సహజంగానే ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికర పరిణామం. అమిత్ షా బీజీగా ఉండి.. అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని… ఏదో కారణంతోనే ఎవాయిడ్ చేస్తున్నారన్న అభిప్రాయం.. బలంగా కలగడానికి కారణం అవుతోంది.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడటానికి అయితే…ఎప్పుడైనా సమయం ఇస్తారని.. కానీ అమిత్ షాను జగన్.. ఇతర కారణాలతో కలవాలనుకుంటున్నారని.. ఆ అజెండా తెలిసినందునే.. పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం.. ఇచ్చినా చివరి క్షణంలో రద్దు చేయడం.. ఒక వేళ కలిసినా.. రాత్రి పది తర్వాత జగన్ వెళ్లి కలవడం వంటివి.. అనేక విమర్శలకు కారణం అవుతున్నాయి.