కరోనా మొదటి వేవ్ సమయంలో హోంమంత్రి అమిత్ షా అంతా తానై వ్యవహరించారు. పదే పదే సమావేశాలు నిర్వహించారు. తానే స్వయంగా కరోనా వైరస్ బారిన పడినప్పటికీ.. కోలుకున్న తర్వాత చురుగ్గా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ వ్యవహారాల్లో బిజీ అయ్యారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ కరోనా సెకండ్ వేవ్‌ని డీల్ చేస్తారనుకుంటే.. ఆయన అసలు కనిపించడం లేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా కూడా మీడియాకు సమాచారం లేదు. సోషల్ మీడియాలో అప్ డేట్స్ లేవు. దీంతో.. మెల్లగా అమిత్ షా ఎక్కడ అనే ప్రశ్న…. పెరిగి పెద్దవుతోంది.
ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు.. హోంమంత్రి కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు కూడా. ఢిల్లీ పోలీసులు అక్కడి ఆప్ ప్రభుత్వం చేతుల్లో ఉండరు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు. అయినా పోలీసులు కంప్లయింట్ తీసుకోవడం… చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే అది ఆన్ లైన్లో చేసిన ఫిర్యాదని.. చెబుతున్నారు. మరో వైపు..నిజంగానే అమిత్ షా ఎక్కడున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సైలెంటయ్యారు. బెంగాల్లో హింస చెలరేగుతోందని… ఎన్నికల హింసను సహించేది లేదని కేంద్ర హోంశాఖ నుంచి డైరక్షన్స్ వెళ్లాయి కానీ అమిత్ షా ఎప్పుడూ ప్రత్యక్షంగా చెప్పలేదు. కానీ జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు బెంగాల్లో పర్యటించారు. కానీ అమిత్ షా మాత్రం పర్యటించలేదు. అయినా … అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్న వస్తోంది. ఈ అంశంపై.. అమిత్ షానే క్లారిటీ ఇస్తే.. ఇలాంటి పిర్యాదులు తగ్గే అవకాశం ఉంది.