ఓ సినిమాలో విద్యార్థి వేణుమాధవ్ ఉంటాడు. ఇంగ్లిష్ రాదు. స్టూడెంట్ అయిన హీరో లెక్చరర్ గా వచ్చి… ఇంగ్లిష్‌లో క్వశ్చన్ అడిగితే… “నేను అచ్చమైన భారతీయుడ్ని.. బ్రిటిష్ వాళ్లపై కోపంతో.. ఇంగ్లిష్ నేర్చుకోలేదు…” అని సమర్థించేసుకుంటాడు. అచ్చంగా ఆ వేణుమాధవ్ స్టైల్‌ని దించేశారు… ప్రధాని నరేంద్రమోడీ. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా… ” నా పార్టీ చీఫ్ అమిత్ షా. నేను క్రమశిక్షణ గల సైనికుడ్ని. పార్టీ చీఫ్ పక్కనుండగా.. మాట్లాడనంటూ…” తప్పించేసుకున్నారు. మోడీ చెప్పిన కారణం విని జర్నలిస్టులు కూడా.. వేణుమాధవ్ సీన్ చూసినప్పుడు.. ప్రేక్షకులు ఎలా నవ్వుకున్నారో అలా నవ్వుకున్నారు.
మీడియా అడిగే ప్రశ్నలు ఎదుర్కోలేని బలహీనత..!
ప్రధాని నరేంద్రమోడీకి… 56 అంగుళాల చాతి ఉంది. అందుకే ఆయనను మిస్టర్ 56 అంటారు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే… పాకిస్థాన్ సైన్యం ఎదురొస్తే.. తన ఛాతిని అడ్డం పెట్టి … వాళ్లను ఎదిరిస్తానన్నంతగా చెబుతూంటారు. శత్రువు ఇంటికి .. నట్టింటికి వెళ్లి కొట్టి వస్తామని… ఎన్నికల ప్రచారసభల్లో హోరెత్తించారు. అందుకే… ఆయన హయాంలో… ఉగ్రవాద దాడులు పెరిగిపోయినా.. దేశం భద్రంగా ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన ఫేస్ టు ఫేస్ తలపడితే.. మీడియా ముందు కూడా.. వణికిపోయే క్యారెక్టర్. ప్రధాని నరేంద్రమోడీ ఇంత వరకూ.. అంటే.. ప్రధాని అయిన ఐదేళ్లలో ఒక్క సారి కూడా.. మీడియాను పిలిచి ప్రెస్‌మీట్ పెట్టలేదు. అందుకు.. ఆయనకు గర్వం అని అనుకున్నారు.. మరికొంత మంది… భయం అన్నారు.. ఇంకొంత మంది.. ఆ అవసరం లేదన్నారు.
ఐదేళ్లలో ప్రెస్‌మీట్ పెట్టకపోవడానికి అసలు కారణం..?
ప్రెస్‌మీట్ పెట్టలేదనే అపప్రదను తప్పించుకోడానికేమో… ఎన్నికల ప్రచారం చివరి రోజు.. అమిత్ షాతో కలిసి.. ప్రెస్ మీట్‌కు వచ్చారు. దాంతో.. చాలా మంది జర్నలిస్టులు.. ప్రశ్నలు అడగడానికి రెడీ అయిపోయారు. అది ప్రెస్ మీటే.. కానీ వన్ సైడెడ్ ప్రెస్ మీట్ . ఇంకా చెప్పాలంటే… అమిత్ షా ఆన్సర్లు ఇచ్చే.. ప్రెస్ మీట్. నరేంద్రమోడీ తాను చెప్పాలనుకున్నది చెప్పారు. తనకు ఏ ప్రశ్న వచ్చినా.. దానికి.. సమాధానం చెప్పాలంటూ.. అమిత్ షా వైపు చూశారు. ఒక్కటంటే.. ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి అన్ని ప్రశ్నలకు.. అమిత్ షానే సమాధానం ఇచ్చారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నంత సేపూ.. మోడీ ఇబ్బందికరంగానే ఉన్నారు.
సెటైర్లతో మరింత గాలి తీస్తున్న విపక్ష నేతలు..!
మోదీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరనేదానిపై.. ఢిల్లీ మీడియా వర్గాల్లోనే అనేక ప్రచారాలు ఉన్నాయి. మోడీ ఇంటర్యూలు కూడా.. ముందస్తుగా రికార్డు చేసినవే ఉంటాయి కానీ… లైవ్ కాదని.. అందరికీ తెలుసు. ఆయన ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌కు..ఇంటర్యూ ఇస్తే… మబ్బులు, రాడార్లు, డిజిటల్ కెమెరాలు, ఈమెయిళ్ల వంటి… మాణిక్యాలు బయటకు వస్తాయని సెటైర్లు వేస్తున్నారు. నిన్నటి ప్రెస్‌మీట్ చూసిన తర్వాత చాలా మందికి అదే అనిపించి ఉంటుంది. విపక్ష పార్టీలు కూడా.. అంతే సెటైర్లు వేశాయి. రాహుల్ గాంధీ అయితే..ఈ సారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అమిత్ షా.. చాన్సిచ్చేలా చూసుకోవాలని సెటైర్ కూడా వేశారు.