తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేటలో మొదటిసారిగా తెరాస ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 90 వేల కోట్ల రూపాయలిచ్చిందన్నారు. అయినా అవి ప్రజలకు సక్రమంగా అందటం లేదని ఆరోపించారు. దీంతో తెరాస అగ్గిమీద గుగ్గిలమైంది. రాష్ట్ర మంత్రులు వరసబెట్టి అమత్ షా పై విరుచుకుపడుతున్నారు.
ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులే తప్ప, కేంద్రం ఎక్కువగా ఏమీ ఇవ్వలేదని తెరాస మంత్రులు చెప్తున్నారు. గత రెండేళ్లలో మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి 36 వేల కోట్ల రూపాయలు కేటాయించిందదని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 15,300 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 90 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా అబద్ధం చెప్పడం సరికాదన్నారు.
రెండేళ్లుగా కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమని బీజేపీ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా, కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూడా విమర్శకు కేంద్ర బిందువుగా చేశారు. కేసీఆర్ ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఎన్ని రోజులు సచివాలయానికి వెళ్లారనేదానిపై శ్వేత పత్రం విడుదల చేస్తారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. మొత్తానికి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. విమర్శలు పదునెక్కుతున్నాయి. ఆరోపణలు పతాక స్థాయికి చేరుతున్నాయి. గత రెండేళ్లలో ఎప్పుడూ ఈ రెండు పార్టీల మధ్య ఈ స్థాయిలో ప్రత్యక్ష యుద్ధం జరగలేదు.
ఎన్డీయేలో తెరాస చేరుతుందని, కేసీఆర్ కుమార్తె కవితకు మంత్రి పదవి వస్తుందని అప్పుడప్పుడూ ఊహాగానాలు వినవస్తుంటాయి. ఇరు పార్టీల వారూ ఖండిస్తుంటారు. కొంత కాలానికి మళ్లీ అవే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఇంతకీ అలాంటి ఒప్పందం రెండు పార్టీల మధ్య ఉందో లేదో తెలియదు. అయితే, 2019 ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని ఇటీవల అమిత్ షా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా ఉన్నట్టే ఇప్పుడు కూడా నిస్తేజంగా ఉంటే నడవదని రాష్ట్ర నాయకులకు స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నాం చాలనుకుని కడుపులో చల్ల కదలకుండా ఉంటే ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించడమే అంతిమ లక్ష్యమని టార్గెట్ ఫిక్స్ చేశారట.
అందుకే, రాష్ట్ర నాయకత్వంలో కదలిక వచ్చింది.
మరోవైపు, అమిత్ షాపై తెరాస నేతల విమర్శలను కమలనాథులు గట్టిగా తిప్పికొడుతున్నారు. కేంద్రం ఎంతో సహాయం చేసిందని, దీనిపైచర్చకు సిద్ధమని సవాలు చేస్తున్నారు. అవసరమైతే చర్చ కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ కైనా వస్తామని ఎద్దేవా చేస్తున్నారు. ఈ విమర్శలు ప్రతివిమర్శలతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఎవరి వాదన నిజమనేది తెలయడం లేదు. ఇప్పటికైనా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, అందులో ఎంత ఖర్చయిందనే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపితే బాగుండేది. పోనీ కేంద్రం లేదా బీజేపీ నాయకులైనా సరైన వివరాలను బయటపెడితే ప్రజలకు ఓ స్పష్టత వస్తుంది. ఆ పని చేస్తారేమో చూద్దాం.