వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపై తమ పట్టు సాధించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉందనే సంగతి తెలిసిందే. అందుకే, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కొన్ని నెలల కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ని భాజపా చాలా సీరియస్ గా తీసుకుంది. అక్కడ కాంగ్రెస్ కి మరోసారి అవకాశం లేకుండా చెయ్యాలనుకున్నారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ భాగస్వామ్యంలోని ప్రభుత్వం ఏర్పడి, భాజపా ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భాజపాకి కర్ణాటకలో ఘోర పరాభవం తప్పలేదు. మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే… ఒక్క లోక్ సభ తప్ప, మిగతా అన్ని చోట్లా భాజపాకి ఓటమే ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల భాజపా నాయకులతో వరుసగా అమిత్ షా మాట్లాడుతున్నట్టు సమాచారం.
ముందుగా, కర్ణాటక నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. షా స్వయంగా ఫోన్ చేసి… లోక్ సభ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు జరిగిన ఈ బైపోల్స్ ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదనీ, ఏకంగా దాదాపు రెండున్న లక్షల ఓట్ల తేడాతో ఓటమి ఎదురయ్యే పరిస్థితి ఉంటే ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోయారని కర్ణాటక కీలక నేతలను అమిత్ షా నిలదీసినట్టు సమాచారం. ఈ ఫలితాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలన్నింటిపై ఉంటుందని మనం చాలాసార్లు చర్చించుకున్నా కూడా ఎందుకు ఇలా జరిగిందని అన్నారట. మరీ ముఖ్యంగా బళ్లారిలో ఓడిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అమిత్ షా క్లాసులు కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాలేదనీ, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ నేతలతోనూ ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడినట్టు వినిపిస్తోంది. తెరాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ తెలంగాణలో భాజపా నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ స్థాయికి తగ్గట్టుగా కనీస గౌరవం పోకుండా ఫలితాలు సాధించేలా నేతలు జాగ్రత్తపడాలని టి. నేతలకు షా సూచించినట్టు సమాచారం. ఆంధ్రా విషయంలో కూడా భాజపా ఇప్పుడు చాలా అగ్రెసివ్ గానే ఉంది. జీవీఎల్ లాంటి నేతల్ని ప్రత్యేకంగా ఏపీ పంపించి మరీ, అక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తూ, వచ్చే ఎన్నికల్లో భాజపాదే హవా అన్నట్టు ప్రచారం చేయిస్తున్నారు. సో.. అక్కడ కూడా వాస్తవంగా భాజపా నమోదు చేసుకోబోతున్న ఫలితాలేంటో అందరికీ తెలిసినవే. అందుకే, ఏపీ నేతలకు కూడా అమిత్ షా దిశా నిర్దేశం చేయబోతున్నారని సమాచారం. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకి దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలపై అమిత్ షా ఒత్తిడి పెంచడం మొదలైందని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితిని సరిగా అర్థం చేసుకోకుండా… నాయకుల మీద ఒత్తిడి పెంచితే ఏం లాభం ఉంటుంది?