భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణ ఓటర్లను ఒక్క చాన్స్ ప్లీజ్ అని వేడుకుంటున్నారు. రోజంతా ప్రచార సభల్లో పాల్గొన్న అమిత్ షా .. ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్కు అవకాశాలు ఇచ్చారని.. ఈ సారి బీజేపీకి ఇచ్చి చూడాలని పదే పదే కోరారు. తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మోడల్ రాష్ట్రంగా ఏ విషయంలో తయారు చేస్తారో చెప్పలేదు కానీ.. తమ అజెండాను మాత్రం చెప్పకనే చెప్పారు. అన్నింటి కంటే ముందుగా ఎంఐఎం ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంఐఎంను బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. పాతబస్తీకే పరిమితమైన పార్టీ వల్ల.. ఏదో నష్టం జరుగబోతోందన్న భావన కల్పించి.. తమ మోడల్ ఎలా ఉంటుందో.. కాస్తంత అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేశారు.
ఎంఐఎంను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్కు లేదని.. అది బీజేపీకే ఉందని స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు అంత శక్తి ఉంటే.. పాతబస్తీలో వాళ్లను ఓడిస్తే.. పనైపోతుంది కదా.. అని డౌట్ సామాన్యులకు వస్తుందని అలోలించలేదు. మోడల్ రాష్ట్రంగా మార్చే ప్లాన్లలో మొదటిది.. తెలంగాణ విమోచన దినం అధికారికంగా పాటిస్తారట. దాని వల్ల తెలంగాణ ప్రజల బతుకులు ఎలా బాగుపడతాయో చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే.. అమిత్ షా .. తన ప్రసంగాల ద్వారా హిందూ ముస్లిం రాజకీయ ప్రయోగాల్లో తెలంగాణను మోడల్‌గా మార్చే ప్రయత్నం చేస్తారని చెప్పకనే చెప్పారు.
ప్రసంగంలో.. కేసీఆర్ నూ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ వైఫల్యం చెందారని మండిపడ్డారు. కొండగట్టు దుర్ఘటనలో 65 మంది చనిపోతే వెళ్లడానికి కేసీఆర్‌కు సమయం లేదు. ఒవైసీ సోదరులతో బిర్యానీ తినడానికి మాత్రం సమయం ఉంటుందా?. అని ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అవసరమా అని.. సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. అమిత్ షా తన ప్రచారంలో బీజేపీ ఎజెండా అయిన… ముస్లింలను… శత్రువులుగా చూపించే అంశాన్ని ఫాలో అయ్యారు కానీ.. తెలంగాణ విషయంలో.. నాలుగున్నరేళ్లలో కేంద్రం.. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయిందో చెప్పలేదు. పన్నుల్లో వాటాలుగా వచ్చిన సొమ్మును కూడా … ఔదార్యంగా ఇచ్చినట్లు ఘనంగా అమిత్ షా ప్రకటించుకున్నారు.