సాధారణంగా హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ ఉంటే.. ఆఫీస్ అవర్స్లోనే ఇస్తారు. కాస్త తీరుబడిగా సమస్యలపై చర్చిస్తారు. మామూలుగా రాత్రి పది తర్వాత పార్టీ నేతలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వరని చెబుతారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. అమిత్ షా .. రాత్రి పది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అరగంట సేపు మాట్లాడి పంపేశారు. పదే పదే అడుగుతున్నారు కదా.. అని… కాస్త సమయం చూసుకుని కలిసినట్లుగా..ఈ భేటీ జరిగిందనే అభిప్రాయం ఢిల్లీలో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాలని..జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చారు. ఓ సారి అపాయింట్మెంట్ ఖరారైనా..ఆ రోజు పుట్టిన రోజు.. శుభాకాంక్షలు చెప్పి రావడమే తప్ప..గోడు వినిపించలేకపోయారు.
అయితే హఠాత్తుగా..ఓ శుక్రవారం అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది. రెండు రోజుల ముందు ప్రధాని మోడీని కూడా కలిశారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపనా పత్రాన్నే.. అమిత్ షాకు ఇచ్చారు. మోడీతో గంటన్నర సేపు మాట్లాడారని.. వైసీపీ ప్రకటించుకుంది. ఆయన ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి బయటకు వచ్చే వరకూ.. ఈ లెక్క ఉంది. అయితే.. అమిత్ షా ఇంట్లోకి వెళ్లినప్పుటి నుండి.. బయటకు వచ్చేసరికి లెక్కలేసుకున్నా.. ఆ సమయం గంట కూడా లేదు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పాలనుకున్నదాన్ని చెప్పారో లేదోనన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం… మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తే చాలు అనుకున్నారు.
ఆ మేరకు.. అటు మోడీ.. ఇటు అమిత్ షాలకు ఇచ్చిన లేఖల్లో దాన్ని ప్రస్తావించారు. దాంతో కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామన్న తమ మాటలకు ఓ జస్టిఫికేషన్ తెచ్చుకున్నారు. వారి రియాక్షన్ ఏమిటో అన్నది మాత్రం బయటకు రాలేదు. బహుశా.. కేంద్రం తీసుకునే చర్యలు.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలే… చర్యలుగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఉత్సాహంగా కనిపించలేదని ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నాయి.