తెదేపా, భాజపాలు రెండూ నిర్మలా సీతారామన్ కి మళ్ళీ రాజ్యసభ సీటు కేటాయించే విషయంలో ఎందుకో చాలా గోప్యత పాటిస్తున్నాయి. ఈసారి ఆమెకు సీటు కేటాయించే ఆలోచన ఏమీ లేదని డిల్లీలో చెప్పిన చంద్రబాబు నాయుడు, ఆ మరునాడే భాజపా నుంచి తమకు ఎటువంటి అభ్యర్ధన రాలేదని చెప్పారు. భాజపా నుంచి అభ్యర్ధన వస్తే పరిశీలిస్తామని నారా లోకేష్ చెప్పారు. అంటే భాజపాకి సీటు కేటాయించడానికి తెదేపా సిద్ధంగానే ఉంది కానీ భాజపాయే చొరవ తీసుకోవడం లేదన్నట్లున్నాయి వారి మాటలు.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, “రాజ్యసభ సీటు గురించి తెదేపాతో మాట్లాడుతున్నాము,” అని క్లుప్తంగా చెప్పారు. అంటే రెండు పార్టీల మధ్య దాని గురించి చర్చలు సాగుతున్నట్లు అర్ధమవుతోంది.
ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించినప్పటి నుండి ఆ రెండు పార్టీల మద్య కొంత దూరం పెరిగినప్పటికీ, హోదా ఇవ్వనందుకు తెదేపా ఏమీ భాజపాపై ఆగ్రహంతో ఊగిపోవడం లేదు. రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా పోరు భరించలేక లేదా వారికి భయపడో మోడీ ప్రభుత్వంపై మొక్కుబడిగా కొన్ని రోజులు విమర్శలు చేసింది తప్ప దానితో తెగతెంపులు చేసుకోలేదు. నేటికీ ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. అవేమీ రాజకీయ శత్రువులు కావు. గతంలో తెదేపా తరపునే నిర్మలా సీతారామన్ రాజ్యసభకి వెళ్ళారు. కనుక మళ్ళీ ఆమెకు అదే సీటు కేటాయించడం కోసం రెండు పార్టీలు ఇంత గోప్యత పాటించవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు బదులుగా కేంద్రం నుండి ఏమైనా హామీలు లేదా గవర్నర్ పదవి వంటి కోర్కెలు ఏమైనా కోరిన వాటినీ రహస్యంగా దాచుకొనవసరం లేదు. ఆ విషయం కూడా మీడియాలో ఎప్పుడో వచ్చేసింది. అయినా ఆ రెండు పార్టీలు ఈ విషయంలో అంత గోప్యత ఎందుకు పాటిస్తున్నాయో? బహుశః నేడో రేపో దానిపై స్పష్టత వస్తుందేమో?