ఇది బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఎంచుకున్న ఫార్ములా. తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలతో వ్యూహాత్మక కదలికలపై సుదీర్ఘంగా సవివరంగా చర్చించిన అమిత్ షా తన పర్యటనలకు జన సమీకరణ ముఖ్యం కాదని సూటిగానే చెప్పేశారట. పార్టీ కార్యకర్తలను నాయకులను సమావేశపర్చి వ్యూహాలను ఖరారు చేసేందుకు నన్ను పిలవండి. ఎన్నిసార్లయినా వచ్చి ఎంతసేపైనా చర్చిస్తాను అని హామీ ఇచ్చారట.తెలంగాణలో బూత్‌కమిటీల ఏర్పాటకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలన్నది ఆయన నిర్దేశం. ఆ విధంగా 23 వేలకు పైగా బూత్ కమిటీలు వేయకపోతే రేపు పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన కసరత్తుకోసం తాను నాయకులతో సమావేశం అవుతాను కాని భారీ బహిరంగ సభలకోసం వ్యయప్రయాసలు వద్దన్నారు. ప్రచార సభలు పెద్ద ఎత్తున పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు. దానివల్ల ఉపయోగం.మనం అంతర్గత అంశాలపైన ప్రజలను ఆకర్షించి ఓట్లను రాబట్టుకోవడంపైన కేంద్రీకరించాలి అంటూ అసలైన ఎన్నికల బోధలు పోసి పంపించారు. ఘర్షణ పడకుండా దూసుకుపోకుండా పార్టీ ఎలా పెరుగుతుందని బోధించారు. మొత్తంపైన మందు అమిత్ షా తర్వాత మోడీ వస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాకు సత్తా గల నాయకులు లేరని చెబితే అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ దాన్నికొంచెం సవరించి సత్తాగల ్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నామని ప్రకటించారు. వాస్తవానికి బిజెపి తరపున పోటీ చేసేందుకు యువనాయకులతో సహా కొందరు ఇప్పటికే నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకుని కేంద్రీకరిస్తున్నారు. బహుశా అలాటివారికి పచ్చజెండా వూపి వ్యక్తిగత బాద్యతలు అప్పగించవచ్చు. అధికార టిఆర్ఎస్తో ఎలాటి సంబంధాలు వుండబోవని అంటూనే ‘ప్రస్తుతానికి’ అని తోక తగిలిస్తున్నారు బిజెపి నాయకులు. 70 ఏళ్లుదాటిన వృద్ధనేతలకు ఇక ఎలాటి పదవులు వుండబోవని వారు సలహాలు సూచనలకే పరిమితం కావాలని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి వంటి పాత నేతలు కొంత కినుక వహించినట్టు కనిపిస్తుంది. అయితే వారు స్పెంట్ఫోర్సుల వంటివారేనని కూడా ఇతర నాయకులు చప్పరిస్తున్నారు. మజ్లిస్‌తో టిఆర్ఎస్ దోస్తానాను అవకాశంగా తీసుకుని దానికి వ్యతిరేకంగా హిందూత్వ రాజకీయాలను అమలు చేయడానికి హైదరాబాద్ మంచి కేంద్రమని బిజెపి నేతలు ఆశపడుతున్నారు. ఇనవ్నీ ఎలా వున్నా 2019 అధికారం గురించి బిజెపి చేసే ప్రకటనలు నేలవిడిచిన సాము వంటివేనని ఇంతకన్నా కొన్ని ఎంపిక చేసిన చోట్ల పటిష్టంచేసుకుంటే కొంతైనా లాభం వుంటుందని సీనియర్లు కొందరు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌కు వస్తే ఇప్పటికీ రాష్ట్రఅద్యక్షుని ఎంపిక పూర్తి కాలేదు.సోము వీర్రాజు అభ్యర్థిత్వానికి వెంకయ్యనాయుడు గట్టి వ్యతిరేకత తెల్పినట్టు చెబుతున్నారు. గతంలోనూ అలా తనను అడ్డుకున్నారు గనకనే సోము వీర్రాజు ఏకపక్ష వ్యాఖ్యలతో వివాదాలు పెంచారనే భావన వుంది.ఇటీవలి సమావేశంలో కూడా ఆయన పేరు పరిశీలించడంపై వెంకయ్య తీవ్ర అభ్యంతరం తెల్పడమే గాక బయిటకు వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. హరిబాబు కొససాగింపునకు అవకాశాలు లేదా ఆకుల సత్యనారాయణ ప్రతిపాదన గురించి మాట్లాడుతున్నారు.పురంధేశ్వరి అయితే చంద్రబాబుతో సంబంధాలు దెబ్బతింటాయనే భావన వుంది. ఈ సమస్య తేలేవరకూ తెలంగాణలో వలె ఎపిలో పెద్ద వూపురాదనిబిజెపి నేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఎప్పటికైనా అక్కడ పెద్ద మార్పు వచ్చేది వుండదని పరిశీలకుల అంచనా. పవన్ కళ్యాణ్ వస్తే మార్పు రావచ్చని ఆశపడుతున్నా ఆ అవకాశం వుండకపోవచ్చు.