జాతీయ పౌరుల జాబితా (ఎన్.ఆర్.సి.)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని భాజపా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గడచిన ఎన్నికల సమయంలో కూడా ఎన్.ఆర్.సి. అంటూ హడావుడి చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. తాజాగా బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమికి కారణం ఈ అంశమే అంటూ ఆ పార్టీ విశ్లేషించుకుంది. అయితే, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి తీరతామనీ, 2024 లోపు దేశంలో ఒక్క చొరబాటుదారుడు కూడా ఉండటానికి వీల్లేదన్నారు. చొరబాటుదారుల్ని గుర్తించి వారి సొంత దేశాలకు పంపిస్తామన్నారు. జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన అక్కడే ఎందుకు చేశారంటే… అక్కడ అసెంబ్లీ ఎన్నికలున్నాయి కదా!
చొరబాటు దారుల్ని ఏరివేయడం మంచి నిర్ణయమే, అయితే దీన్ని అమలు చేస్తామని చేసే ప్రకటనను ప్రతిపక్ష పార్టీ మీద ఆగ్రహంతోనో, ఆ పార్టీకి చెందిన నాయకుడి మీద విమర్శలతోనే ప్రకటించాల్సిన పనేముంది..? ఎన్.ఆర్.సి.ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామంటూ… రాహుల్ గాంధీ మీద విమర్శలు చేశారు అమిత్ షా! ఎన్.ఆర్.సి.ని రాహుల్ బాబా ఎందుకు వద్దంటున్నారు అని ప్రశ్నించారు. చొరబాటుదారుల్ని పంపిస్తే ఎక్కడికి వెళ్తారు, ఏం తింటారు, ఏమౌతారంటూ రాహుల్ బాబా ఎందుకు ఆవేదన చెందుతున్నారన్నారు! ఎందుకు సోదరా… మీ తోడబుట్టినవాళ్లంతా ఆ జాబితాలో కనిపిస్తున్నారా, అయినాసరే… భాజపా అందర్నీ ఏరి పంపేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం గురించి కూడా మాట్లాడారు. మందిరం నిర్మించాలా వద్దా చెప్పాంటూ ప్రజల్ని ప్రశ్నించారు.
నిజానికి, జార్ఖండ్ లో రైతుల సమస్యలు, రుణమాఫీని ప్రధాన ప్రచారాస్త్రంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో మొదటి నిర్ణయంగా రుణమాఫీ అమల్లోకి తెస్తున్నామంటున్నారు. గిరిజనుల భూముల్ని లాక్కుని పారిశ్రామికవేత్తలకు ఇచ్చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాలకు అమిత్ షా సమాధానం ఇవ్వడం లేదు. భాజపా ప్రచార అజెండాలో కూడా ఇలాంటివేవీ ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇవన్నీ వదిలేసి జాతీయాంశాలైన ఎన్.ఆర్.సి., రామమందిరాలను చర్చకు పెడుతున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు అనేసరికి ఇలాంటి వాటికంటే ఆయా రాష్ట్రాల సమస్యలు ప్రధానం అవుతాయి. కానీ, ఇక్కడ కూడా మళ్లీ జాతీయత, హిందుత్వ లాంటి భావోద్వేగపూరిత అంశాలనే ప్రచారంలోకి ప్రముఖంగా తెచ్చే ప్రయత్నం అమిత్ షా చేస్తున్నారు.