ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భారతీయ జనతా పార్టీని మెల్లగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించాడనికి వచ్చిన బీజేపీ పెద్దల ముందు … ఆ పార్టీ తెలంగాణ నేతలు… ఓ రేంజ్లో ఫైరయిపోయారు. బయటకు కారణాలు ఏమి చెప్పినా… టీఆర్ఎస్కు తోక పార్టీగా వ్యవహరించడం వల్లనే ఓడిపోయామని.. జాతీయ రాజకీయాల కోసం తమను బలి చేశారని.. నేతలు హైకమాండ్ దూతల వద్ద… వాపోయారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఏమిటంటే.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ… తాను రాజీనామా చేస్తానని… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. నేరుగా హైకమాండ్‌కు సందేశం పంపారు. దీన్ని చూసి.. అమిత్ షా ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఎందుకంటే.. లక్ష్మణ్ .. తెలంగాణకు బాధ్యత తీసుకుంటే… మరి మిగతా రాష్ట్రాల్లో ఓటమికి తాము బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా.. అనేది అమిత్ షా పాయింట్.
నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయిందని ఇక్కడ రాజీనామా చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేయాల్సి వస్తుందని అది పార్టీకి మంచిది కాదని అమిత్ షా అన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో… విజయం వచ్చినప్పుడు.. తమ ఘనతేనని చెప్పుకుని… ఇప్పుడు ఓటములు వచ్చినప్పుడు పట్టనట్లు మోడీ , షా ఉంటున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే అమిత్ షా తో సహా చాలా రాష్ట్రాల్లో అధ్యక్ష పదవీ ఈ నెలాకరుతో ముగియనుంది. ఇప్పుడు రాజీనామాల పరంపర అంటూ ప్రారంభమైతే… బీజేపీ అధ్యక్షుడ్ని కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అమిత్ షా ఈ సమయంలో రాజీనామాలు వద్దని చెప్పినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మణ్ ను సాగనంపాల్సిందేనంటూ.. కొంత మంది నేతలు.. లాబీయింగ్ చేస్తున్నారు.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టామంటూ.. అమిత్ షా.. తెలంగాణ నేతలకు ధైర్యం చెప్పేవారు. కానీ… జాతీయ రాజకీయాల కోసం.. తమను చిన్న చూపు చూసి.. టీఆర్ఎస్ కోసం బలి చేశారన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. వరుసగా పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండంతో తెలంగాణ పార్టీ కనుమరుగు అవుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అమిత్ షా రాక కూడా వాయిదా పడింది.