తెలంగాణ పర్యటనలో అమిత్ షా కేంద్రదర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించినట్లుగా బయటకు వెల్లడి కావడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఐటీ, ఈడీ, సీబీఐలకు సంబంధించి దక్షిణాది ఉన్నతాధికారులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఈ సమావేశం జరిగిందని చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రివ్యూ చేసి ఉండవచ్చు.. ఇందులో పెద్ద విశేషం ఏమీ ఉండదు కానీ…. తెలంగాణ రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ మీటింగ్ ఆసక్తి రేపుతోంది.
ఇటీవలి కాలంలో ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అధికార పార్టీ పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం ఉన్న అన్ని బడా రియల్ ఎస్టేట్ కంపెనీలపైనా దాడులు జరిగాయి. ఎంతెంత దొరికింది.. ఆ లెక్కలేంటి అన్నది ఇంకా బయటకు రాలేదు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. పాతిక, ముఫ్పై బృందాలతో సోదాలు నిర్వహించడం… అందులో కవిత పేరు ప్రధానంగా వినిపించడంతో సహజంగానే ఈ అంశం హాట్ టాపిక్ అవుతుది.
ఒక వేళ తెలంగాణ రాజకీయాల మీద గురి పెట్టి.. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు అమిత్ షా దిశానిర్దేశం చేసి ఉంటే.. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. హోంమంత్రి హోదాలో రొటీన్‌గా ఆయన సమావేశం అయి ఉంటే మాత్రం .. పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయితే అమిత్ షా కారణాలు లేకుండా సమావేశాలు నిర్వహించరని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.