తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ… రెండూ మిత్రపక్షాలు. మిత్ర ధర్మం ఎలా పాటించాలో కూడా ఇటీవలే చర్చలు పెట్టుకున్నాయి. కానీ, కేంద్ర బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఏ ధర్మాలూ భాజపా పరిగణించలేదు. ఒక్క రాజకీయ ధర్మమే పాటించింది. విభజన హామీల ఊసు లేదు. అమరావతి నిర్మాణ నిధుల ప్రస్థావన లేదు. ప్రత్యేక రైల్వే జోన్ అనేది అస్సలు పట్టించుకోలేదు. కేంద్ర సంస్థలకు కేటాయింపులు కూడా అరకొర.. ఓవరాల్ గా మిత్రపక్షమైన టీడీపీ పాలిత రాష్ట్రంపై భాజపా వైఖరి మరీ ఇంత దారుణమేంటీ అనే స్థాయిలో బడ్జెట్ ఉంది. ఇంతకీ.. ఆంధ్రా విషయంలో భాజపా ఇంత కఠినంగా వ్యవహరించడం వెనక ఉన్న రాజకీయ కోణమేంటీ..? టీడీపీని వదులకునేందుకే సిద్ధమౌతున్నారా..? లేదంటే, ఆంధ్రాతో భాజపాకి అవసరం లేదని నిర్ణయానికి వచ్చేశారా..? ఆంధ్రాకు ఎంత చేసినా భాజపాకి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని లెక్కలేసుకున్నారా..? ఇంతకీ, పార్టీపరంగా అమిత్ షా వ్యూహమేంటీ..? ఇప్పుడు ఈ అంశాలే చర్చనీయంగా మారుతున్నాయి.
ఆంధ్రా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి… ప్రతీదానికీ పక్క రాష్ట్రాలతో లంకెలు పెడుతూ వస్తోంది భాజపా! ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయనీ, వారి మనోభావాలు దెబ్బతింటాయని ఆ మధ్య చెప్పుకొచ్చారు. పోలవరం విషయంలో కూడా ఓ దశలో పై రాష్ట్రాల ఒత్తిడి ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు రైల్వే జోన్ విషయమే తీసుకుంటే.. ఒడిశాలో మనోభావాలు దెబ్బతింటాయని ఆంధ్రాకు జోన్ లేకుండా చేశారు. ఒడిశాలో భాజపా అధికారంలోకి రావాలనేది అమిత్ షా రాజకీయ లక్ష్యాల్లో తదుపరి అంశం. ఆంధ్రాకి రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఒడిశా నుంచి లాక్కున్నారనే అభిప్రాయం ఆ రాష్ట్రంలో కలిగితే.. భాజపాని అక్కడ ప్రజలు ఆదరించే అవకాశం తగ్గుతుంది కదా. కాబట్టి, ఆంధ్రాకు రైల్వే జోన్ వద్దనేది అమిత్ షా రాజకీయ నిర్ణయంగా కనిపిస్తోంది. ఇక, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కేటాయింపులు చేశారు. ఆంధ్రాలో ఏదో ఒక చిన్న రైల్వే లైనుకు తప్ప… శాఖాపరంగా రాష్ట్రానికి చూపించింది మొండి చెయ్యే! కర్ణాటక మీద ఆ ప్రత్యేక ప్రేమ ఎందుకయ్యా అంటే.. అక్కడ ఎన్నికలున్నాయి! సిద్ధరామయ్య సర్కారును పడగొట్టి భాజపాని గెలిపించాలన్నది అమిత్ షా రాజకీయ లక్ష్యాల జాబితాలో ఉంది కదా.
సరే, పక్క రాష్ట్రాలపై అమిత ప్రేమ కురిపిస్తూ… ఆంధ్రాపై నిర్లక్ష్యం వహిస్తే రాజకీయంగా భాజపా దెబ్బతినే అవకాశం ఉండదా.. అనే లెక్కలు భాజపాకి అనవసరం. ఎందుకంటే, ఆంధ్రాలో ఒంటరిగా భాజపా ఏమీ సాధించలేదు అనేది అమిత్ షాకి తెలుసు. అలాగని, ఈ సవతి తల్లి ప్రేమ చూపడం వల్ల తమకు జరిగే నష్టం కూడా ఏదీ ఉండదనేది వారి లెక్క! ఎలా అంటే… ఆంధ్రాకు కేటాయింపులు చాల్లేదంటూ ఆగ్రహంతో టీడీపీ పొత్తు తెంచుకుందే అనుకుందాం! వెంటనే భాజపా చంక ఎక్కేందుకు వైకాపా సిద్దంగా ఉంది కదా! భాజపా మీద మోజున్న పార్టీలు ఏపీలో ఉన్నాయి. కాబట్టి, ఏపీ ప్రజలు ఏమనుకుంటారో, ఆగ్రహిస్తారేమో, ఆదరించరేమో.. ఇలాంటి ఇబ్బందులు భాజపాకి లేవు. వారికి కావాల్సింది కేవలం కొంతమంది ఎంపీల మద్దతు. ఆ సంఖ్య టీడీపీ నుంచి కాకపోతే వైకాపా నుంచి వస్తుంది. అదీ కాదంటే మరో పార్టీ రావొచ్చు.
ప్రాక్టికల్ గా ఆలోచించుకుంటే భాజపాకి నష్టమేముంది..? కాబట్టి, ఆంధ్రాపై ప్రత్యేక అభిమానం ప్రదర్శించాల్సిన రాజకీయ అవసరం వారికేముంది..? అమిత్ షా లెక్క ఇలానే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి, ప్రజల అవసరాలు, దీర్ఘకాలంలో దేశాభివృద్ధి లక్ష్యాలుగా రూపొందాల్సి కేంద్ర బడ్జెట్ ను కూడా… అధికార పార్టీల రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే ఓ నూతన దుస్సాంప్రదాయాన్ని భాజపా సెట్ చేసిందని చెప్పుకోవచ్చు..!