తెలంగాణలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భాజపా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్నొక ప్రభుత్వ పండుగ కార్యక్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి అతిథిగా కేంద్ర హోం మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని కూడా టి. నేతలు చెప్పారు. అయితే, అనూహ్యంగా ఆయన పర్యటన రద్దు అయింది.
భాజపా అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పటాన్ చెరులో పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు అమిత్ షా హాజరు కావడం లేదని చెప్పారు. ఆరోజున ఢిల్లీలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలున్నాయనీ, అందుకే రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆయన స్థానంలో మరో కేంద్రమంత్రిని ముఖ్య అతిథిగా పంపిస్తారని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రతీ ఒక్కర్నీ స్మరించుకోవాలనీ, విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ఊరు నిండా జెండాలు అనే కార్యక్రమాన్ని పార్టీ చేపడుతోందని చెప్పారు.
ఆరోజు అమిత్ షా బిజీ అని మాత్రమే చెప్పారుగానీ, ఫలానా కార్యక్రమం వల్ల బిజీ అని చెప్పలేదు. నిజానికి, తెలంగాణలో విమోచన దినోత్సవం అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగానే ఇన్నాళ్లూ ఉంది. ముస్లింల మనోభావాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందా అనే అభిప్రాయంతోనే తెరాస కూడా ఈ టాపిక్ మీద ప్రతీయేటా మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. దీన్నే భాజపా తమకు పనికొచ్చే రాజకీయాంశంగా తలకెత్తుకుంది. అందర్నీ కలుపుకుని పోయే విధంగా ఈ ఉత్సవాలను జరిపేలా భాజపా వ్యూహం మొదట్నుంచీ లేదు. కాబట్టి, ఇలాంటి కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి హోదాలో అమిత్ షా రావడం అనేది కూడా కొన్ని విమర్శలకు ఆస్కారం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ని రాజకీయాంగా ఎదుర్కొనే క్రమంలో ఈ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా… రాష్ట్ర పరిధి దాటి ఆలోచిస్తే, ఈ విషయంలో భాజపా అనుసరిస్తున్న తీరు ముస్లింల పట్ల ఆ పార్టీ వ్యవహార శైలికి అద్దం పట్టే అంశంగానూ కనిపిస్తోంది. ఈ టాపిక్ మీదే మొత్తం ఫోకస్ అంతా పెట్టేసి, విమర్శలు చేస్తూ పోతే… తెలంగాణలో భాజపాకి ఎంతో కొంత మైలేజ్ రావొచ్చేమోగానీ, ఇతర రాష్ట్రాల్లో ముస్లింల స్పందనను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా! అమిత్ షా పర్యటన రద్దు వెనక ఇంత లోతైన చర్చ జరిగిందో లేదో తెలీదుగానీ… ఆయన పర్యటన రద్దుతో ఈ సభకు కొంత ఆకర్షణ తగ్గుతుందనేది వాస్తవం.