అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినందున చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారని టీడీపీ వర్గాలు ప్రకటించుకున్నాయి. దాదాపుగా ఇరవై నిమిషాల పాటు చంద్రబాబుతో షా మాట్లాడారని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలనుకున్నారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు.
దీంతో మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత అమిత్ షా ఫోన్ చేసినట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబును కలవడానికి అమిత్ షా ఇష్టపడలేదని .. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ఫోన్ చేయడం టీడీపీ వర్గాలకు ఎదురు దాడి చేయడానికి అవకాశం లభించినట్లయింది.
అమిత్ షా ఫోన్ చేయడానికి ముందే ఢిల్లీలో విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబును ఉగ్రవాదితో పోల్చారు. ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. ఈ పరిణామాలు టీడీపీ వర్గాల్లో కాస్తంత ఉత్సాహాన్ని నింపాయి.