ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేదేపాకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని యోచిస్తున్న బీజేపీ ఆదివారం రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజి మైదానంలో బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతారు. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్దార్హ నాథ్ సింగ్ నిన్న రాష్ట్రానికి చేరుకొని సభకి ఏర్పాట్లను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసారు.
రేపటి సభలో అమిత్ షా స్వయంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలు, అదే విధంగా కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఈ సభ ముఖ్యోదేశ్యం రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సరయిన సమాధానం చెప్పి రాష్ట్రంలో బీజీపీని బలోపేతం చేసుకోవడమే. కనుక అందుకు అనుగుణంగానే అమిత్ షా ప్రసంగం ఉండవచ్చును. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా తెదేపా అడ్డుపడుతోందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కనుక తెదేపాకు ఈ వేదికపై నుండి ఆయన కొన్ని సూచనలు చేయవచ్చును. తెదేపా పట్ల బీజేపీ వైఖరి మున్ముందు ఏవిధంగా ఉండబోతోందో ఈరోజు ఆయన ప్రసంగంలో స్పష్టం అయ్యే అవకాశం ఉంది.