భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 15న హైదరాబాద్ వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయినట్టుగా పార్టీ వర్గాలు ప్రకటించారు. ఆరోజు ఉదయాన్నే ఆయన నగరానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుడతారని రాష్ట్ర భాజపా నేతలు చెప్పారు. ఆ తరువాత, శక్తి కేంద్ర ప్రతినిధులతో సమావేశం, అనంతరం ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్తామనేది వివరించేందుకు ప్రెస్ మీట్ పెడతారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత, పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఇలా రోజంతా ఆయన పర్యటన బిజీబిజీగా కొనసాగనుంది. దీంతో శనివారం నాడు రాష్ట్రంలో భాజపా శ్రేణులన్నీ హడావుడిగా ఉండబోతున్నాయి.
పార్టీ ప్రముఖులతో జరగనున్న భేటీలో అభ్యర్థుల అంశమే ప్రధాన అజెండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భాజపా తరఫున ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు, ఏయే నియోజక వర్గాల్లో భాజపా ప్రభావితం చేసే అవకాశం ఉంది… ఇలాంటి అంశాలపై రాష్ట్ర నేతలతో అమిత్ షా చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే, కొంతమంది ఆశావహుల జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని వినిపిస్తోంది. తెలంగాణలో 119 స్థానాల్లో భాజపా ఒంటరిగానే బరిలోకి దిగుతుందనీ ఓ నాలుగు రోజుల కిందటే లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు చెప్పారు. అంతేకాదు, తెరాసకు ధీటుగా రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రచార సభలు నిర్వహిస్తున్నట్టూ ప్రకటించారు. అమిత్ షా రాకతో ఈ 119 మంది ఎవరనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామనీ అన్నారు.
అమిత్ షా రాకతో రాబోతున్న మరో స్పష్టత ఏంటంటే… కేసీఆర్ విషయంలో భాజపా అనుసరించబోతున్న వైఖరి ఏంటనేది!.. తెరాస, భాజపాల మధ్య రహస్య పొత్తు ఉందనే ప్రచారం తీవ్రంగానే ఉంది. ఓరకంగా రాష్ట్ర భాజపా నేతలకు అదే ప్రతిబంధకంగా మారింది. గతవారంలో అమిత్ షాను శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్న సందర్భంగా కూడా ఇదే అంశం లక్ష్మణ్ చర్చించారు. మరి, మహబూబ్ నగర్ సభలో ఆయన కేసీఆర్ పై విమర్శల దాడికి దిగుతారా, లేదంటే అభివృద్ధి మంత్రం జపించేసి మధ్యే మార్గంగా మాట్లాడి వెళ్లిపోతారా అనేది చూడాలి. తెరాస విషయమై అనుసరించే వైఖరి ఏంటనేది ఇప్పటికైనా స్పష్టత ఇవ్వకపోతే… భాజపా ప్రచారానికి కొంత ఊపు వచ్చే అవకాశమైతే లేదనే చెప్పాలి.