భారతీయ జనతా పార్టీ మెల్లగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే.. తమకు ఇష్టం లేని.. కొంత మందికే రూల్స్ అన్వయిస్తూ.. పార్టీపై పెత్తనం చేస్తున్న పెద్దలు… మూల సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైనా రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదనేది… ఆ పార్టీ నిబంధన. ఇప్పుడు.. అమిత్ షా కోసం దాన్ని పక్కన పెడుతున్నారు. ఆయన నాయకత్వం అవసరం అంటూ… అటు కేంద్రమంత్రిగానూ… ఇటు బీజేపీ అధ్యక్షుడుగానూ కొనసాగనున్నారు.
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. మోదీ టీమ్‌లో చేరిపోవడంతో…. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్న ప్రచారం జరిగింది. అమిత్ షా స్థానంలో కొందరు బీజేపీ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. జేపీ నడ్డా అనే సీనియర్ నేతను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో.. ఆయనకు అధ్యక్ష పదవి ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు .. ఆయనకు షాక్ ఇచ్చారు. అమిత్ షానే అధ్యక్షునిగా కొనసాగబోతున్నట్లు తేలిపోయింది. 2014లో రాజ్‌నాథ్ సింగ్‌కు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాగానే పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా నియమితులుయ్యారు. కానీ అమిత్ షా ఇప్పుడు.. హోంమంత్రిగా ఉంటూనే పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాలనుకుంటున్నారు.
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా,జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని తిరిగి దక్కించుకోవాలి..! జార్ఖండ్‌లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే అమిత్ షా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే… పార్టీ ఘన విజయం సాధిస్తుందనే వాదన వినిపించారు. ఈ ఎన్నికల తర్వాత అంటే జనవరి 2020లో నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని చెబుతున్నాయి కమలం వర్గాలు. కానీ.. ప్రతీ ఏడాది.. ఏదో రాష్ట్రం ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఆ ఎన్నికల వరకూ.. అమిత్ షానే అంటూ.. ఆయనను కొనసాగించడానికే.. ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.
పార్టీ మూల సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి.. అమిత్ షాను అధ్యక్షునిగా కొనసాగించేందుకు ఇప్పటికే ఓ వాదన కూడా ప్రారంభమయింది. రాబోయే రెండేళ్లలో పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు పలు కీలక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని.. వాటిలో కాషాయ జెండా ఎగరాలంటే అమిత్ షానే అధ్యక్షుడిగా ఉండాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ ఏడాది తర్వాత బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తంగా తాజా పరిణామాలు అమిత్ షా వైపు మొగ్గు చూపాయి. అంటే బీజేపీ అంతిమంగా మోడీ, షా చెప్పుచేతుల్లోకి వెళ్లిపోయినట్లే. ఎంత సీనియర్లైనా ఇక నోరెత్తలేరు..!