భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 15న తెలంగాణ వస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలకు స్వయంగా అమిత్ షా చెప్పారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అమిత్ షాకి వివరించినట్టు సమాచారం. ఇదే సమయంలో, టీడీపీ కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే అంశమూ చర్చకు వచ్చిందని తెలుస్తోంది. అయితే, తెలంగాణలో భాజపా అన్ని స్థానాలకూ పోటీ చేస్తుందనీ, తెరాసతో ఎలాంటి లోపయికారీ ఒప్పందాలు లేవనేది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందనీ, కనీసం ముప్పై నుంచి నలభై స్థానాలు భాజపా గెలువాలని అమిత్ షా లక్ష్యం నిర్దేశించారు. అమిత్ షా తెలంగాణ వచ్చి తెరాసను కడిగేస్తారనీ, తెరాసకు వ్యతిరేకంగా భాజపా పోరాటం చేస్తుందని రాష్ట్ర నేతలు అంటున్నారు!
ఇంతకీ, కేసీఆర్ ని అమిత్ షా తీవ్రంగా విమర్శించే పరిస్థితి ఉందా..? 15న ఆయన తెలంగాణ వచ్చి, తెరాస సర్కారుపై ఆరోపణలు చేస్తే నమ్మేవారు ఉంటారా..? ఎందుకంటే, భాజపా తెరాసల మధ్య ఒక అదృశ్యమైన పొత్తు బలపడిందనేది కనిపిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేసీఆర్ కు నేరుగా వెళ్లి కలుసుకునేంత చొరవ ఏర్పడింది. అంతేకాదు, కాంగ్రెస్ ని విమర్శించే విషయంలో కూడా మోడీ మనసెరిగి మరీ కేసీఆర్ ప్రసంగిస్తున్న పరిస్థితి ఉంది! కేసీఆర్ తీరుని మోడీ మెచ్చుకుంటున్నారట కదా! ముందస్తు ఎన్నికలకు వెళ్లడమనేదే కేంద్రం డైరెక్షన్ లో జరిగిన పనిగా విశ్లేషించేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరాసకు వ్యతిరేక పార్టీగా భాజపా ఉన్నట్టు ఎవ్వరూ అనుకోవడం లేదు. జరగబోయే ఎన్నికలు తెరాస వెర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటాయి. ఈ క్రమంలో భాజపాను సీరియస్ పోటీదారుగా పరిణించేందుకు కావాల్సిన ఒక్కటంటే ఒక్క అంశం కూడా కనిపించడం లేదు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, అమిత్ షా తెలంగాణకు వస్తారూ, కేసీఆర్ మీద నిప్పులు కురిపించేస్తారూ అనే ప్రకటనలు భాజపా జాతీయ నాయకత్వం నుంచి వెలువడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ విషయంలో మోడీ ఒకలా, అమిత్ షా మరొకలా వ్యవహరించరు కదా! తెరాస విషయంలో భాజపాకి స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం లేకుండా చేసుకున్నది వారే! కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో తెరాసతో ఎలా వ్యవహరించాలో టి. భాజపా నేతల్లో గందరగోళం ఇప్పటికీ ఉండనే ఉంది. దీనిపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. అలాంటప్పుడు, రాష్ట్రంలో నలభై స్థానాల్లో గెలుపు, తెరాసతో పోరాటం అనేది భాజపా లక్ష్యాలుగా నిర్దేశించుకోవడం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు.