కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ షెడ్యూల్లో రామోజీరావుతో భేటీ కూడా ఉంది. ఇందు కోసం ఆయన మునుగోడులో సభ ముగిసిన తర్వాత హెలికాఫ్టర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ ముప్పావుగంట సేపు ఉంటారు. అయితే అది ప్రైవేటు కార్యక్రమం. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు అనే షెడ్యూల్లో ఉంది కానీ.. ఆయనేం చేస్తారన్నరన్నది మాత్రం లేదు. అయితే బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా రామోజీరావుతో భేటీ కోసమే అమిత్ షా ఫిల్మ్ సిటీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలతో రామోజీతో అమిత్ షా భేటీ .. చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. మోదీని అదే పనిగా పొగుడుతున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరించడం ప్రారంబించారు. ఈ క్రమంలో రామోజీతో భేటీలో పొత్తుల అంశం చర్చకు వస్తుందనేది ఎక్కువ మంది చెబుతున్నమాట.
తెలంగాణలో టీడీపీ బీజేపీకి సహకరించడం.. ఏపీలో టీడీపీకి బీజేపీ సహకరించడం అనే ఫార్ములా మీద వర్కవుట్ చేస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఇప్పుడు అమిత్ షా రామోజీ రావును కలుస్తూండటంతో మరింత జోరుగా ఈ చర్చలు సాగే అవకాశం ఉంది.