తెలంగాణలో ఇంతవరకూ తెరాస వెర్సెస్ మహాకూటమి అన్నట్టుగానే ఎన్నికల పోరాటం ఉంటుందనే వాతావరణం ఉంది. అయితే, తాము కూడా గట్టి పోటీదారులమే అని నిరూపించుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా కసరత్తు ప్రారంభించింది. దాన్లో భాగంగానే పరిపూర్ణానందను ప్రచారంలోకి దించాలని భావించడం. దీంతోపాటు, తెలంగాణలో స్టార్ కేంపెయినర్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరుసగా బహిరంగ సభలు, పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలతో ధీటుగా తామూ ఎన్నికల బరిలో ఉన్నామని చాటి చెప్పడం కోసం ఏకంగా 15 మంది ముఖ్యమంత్రులు, 100 మంది ఎంపీలను ప్రచారంలోకి దింపుతామని అమిత్ షా అంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. అయితే, ఈ ప్రచారంలో మొదటి లక్ష్యం… తెరాసతో తమకు రహస్య మితృత్వం లేదని తెలంగాణలో చాటి చెప్పుకోవడం!
ఆ మధ్య అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద బాగానే విమర్శలు చేశారు. ఇకపై వరుసగా సభలూ సమావేశాలూ ప్రచార కార్యక్రమాలు పెట్టి.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట! నిజానికి, తెరాస మితృత్వ ఇమేజ్ నుంచి బయటపడితే తప్ప… తెలంగాణలో కొంతైనా భాజపాకి ప్రాధాన్యత దక్కదు అనేది వాస్తవం! అయితే, ఈ ఇమేజ్ నుంచి బయటపడాలని భాజపా బలంగా అనుకున్నా… సాధ్యం కాని స్థాయిలో ఒక రకమైన రాజకీయ వాతావరణాన్ని కేసీఆర్ సెట్ చేసేశారు అనడంలో సందేహం లేదు!
మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను దేశమంతా వ్యతిరేకిస్తున్నా మెచ్చుకున్నవారిలో కేసీఆర్ నిలిచారు. ఆ తరువాత, ఫెడరల్ ఫ్రెంట్ అంటూ కేసీఆర్ జాతీయ రాజకీయ వేదిక అని హడావుడి చేసినా… అది లోపయికారీగా మోడీకి మేలు చేసే వేదిక అనే ఇమేజే తెచ్చుకుంది! ఇక, ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాక… ఆ ఫ్రెంట్ ఆలోచనల్ని కేసీఆర్ వదిలేశారు. కాంగ్రెసేతరం, భాజపాయేతరం అనే సిద్ధాంతాన్ని సుప్తచేతనావస్థలోకి నెట్టేశారు. ఇది కూడా భాజపా అనుకూల చర్యగానే విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి. ఇక, ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధం కాగానే… మోడీ సర్కారు అన్ని విధాలుగా సాయం చేసిందనే అభిప్రాయమూ బలంగానే ఉంది! ఇలా భాజపా, తెరాసల మధ్య రహస్య స్నేహం ఉందని బలంగా ప్రజలు నమ్మడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ కాదని.. తెరాసపై వ్యతిరేకంగా భాజపా పోరాడుతోందని తెలంగాణ ప్రజలను నమ్మించాలంటే.. భాజపాకి కత్తి మీద సామే! ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ఎంపీలు రంగంలోకి దిగినా… అవన్నీ తెలంగాణ ప్రజలకు పరిచయం లేని ముఖాలే తప్ప, తెరాసకు ధీటుగా భాజపా సిద్ధమౌతున్న క్రమాన్ని ఎలా చాటి చెప్పగలరు..?