మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న అమిత్ షాను .. జూనియర్ ఎన్టీఆర్ కూడా కలవనున్నారు. వీరి మధ్య భేటీ పావుగంట పాటు జరిగే అవకాశం ఉంది. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాను అమిత్ షా చూశారు. అందులో ఎన్టీఆర్ నటనను చూసి ఆయన ఫిదా అయ్యారు. అందుకే హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పావుగంట సేపు విందు భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతన్నారు.
అయితే సినిమాలో ఇద్దరు హీరోలు ఉండగా.. ఒక్క ఎన్టీఆర్‌నే ఎందుకు పిలిచారని.. పిలిస్తే ఇద్దర్నీ పిలవాలి కదా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అందుకే .. ఈ భేటీలో రాజకీయ కోణం చర్చకు వస్తోంది. ఎన్టీఆర్‌కు రాజకీయ నేపధ్యం ఉంది. ఆయన ఫ్యాన్స్ కూడా పొలిటికల్ కామెంట్లు చేస్తూంటారు. అయితే సినిమాల్లో తాను ఇంకా ప్రాథమిక స్టేజ్‌లోనే ఉన్నానని.. ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని ఎన్టీఆర్ చెబుతూంటారు. ఆ తర్వాతే రాజకీయాల గురించి ఆలోచిస్తానన్నారు. అందుకే అమిత్ షాతో భేటీ అనే సరికి రాజకీయాలూ చర్చకు వస్తున్నాయి.
అయితే అమిత్ షా.. జూనియర్‌తో రాజకీయాలు చర్చించకపోవచ్చని అంటున్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. ఎన్టీఆర్ విషయంలో ఏమైనా మినహాయింపులు తీసుకుంటారో లేదో కానీ.. ఇప్పటికైతే.. ట్రిపుల్ ఆర్ గురించి మాత్రమే… భేటీ ఉంటుందని.. ఎన్టీఆర్ ప్రదర్శనకు మెచ్చి విందుకు పిలిచారని అంటున్నారు. అయితే ఇది పునాది అవుతుందని.. పరిచయాలు పెరిగితే.. తర్వాత రాజకీయం వేరే ఉంటుందని చెప్పాల్సిన పని ఉండదు.