తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత నాలుగేళ్లలో రాజకీయంగా తెచ్చిపెట్టుకున్నది అహంకారం మాత్రమేనని.. ఇతర రాజకీయ పార్టీలన్నీ విమర్శిస్తూంటాయి. అవి విమర్శలకే పరిమితం కాలేదు.. చేతల్లో కూడా బయటకు వచ్చాయి. బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టాయి. ఉపఎన్నికల్లో.. విపక్షాలన్నీ అదే స్ఫూర్తి కనబరచడంతో… భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా.. 2019 ఎన్నికల్లో మోదీ పరాజయం ఖాయమన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో… ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు కూడా పక్క చూపులు చూస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పేసిన తర్వాత ఎన్డీఏలో ఉన్న బలమైన మిత్రపక్షాలు రెండే.. ఒకటి శివసేన, రెండు జేడీ యూ. శివసేన ఎప్పుట్నుంచో బీజేపీతో విబేధిస్తోంది. కొన్ని రోజుల క్రితమే తాము ఒంటరి పోరుకు వెళ్తున్నామని ప్రకటించింది. ఉపఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు ప్రస్తావన తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ, అమిత్ షా ల చేతికి వెళ్లిన తర్వాత.. ఒకే రకమైన సిద్ధాంత భావజాలం ఉన్న శివసేనను.. కబళించడానికి ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన శివసేన.. చాలా దూకుడుగా బీజేపీతో తలపడుతోంది. అయినా సరే.. తమకు ఎదురు లేదన్న కారణంగా నాలుగేళ్ల పాటు… అమిత్ షా కానీ.. నరేంద్రమోదీ కానీ.. శివసేనను పట్టించుకోలేదు. ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమవడంతో … కుర్చీ కిందకు నీళ్లు వస్తున్న సంగతిని మోదీ, షా గుర్తించారు. అందుకే.. ఉన్న మిత్రపక్షాలను కూటమిలోనే ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
నాలుగేళ్ల పాటు శివసేనను పట్టించుకోని అమిత్ షా.. మారిన రాజకీయ పరిస్థితుల్లో.. ఉద్దవ్ ధాకరే ఇంటికి వెళుతున్నారు. ఉద్దవ్ అపాయింట్ మెంట్ కావాలని.. స్వయంగా అడిగి మరీ… ముంబై వెళ్తున్నారు. ఈ భేటీపై శివసేన నాయకులు.. మామూలుగానే స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు అమిత్ షాకు గుర్తుకు రాని మిత్రబంధం..నాలుగేళ్ల తర్వాత ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేయాలన్న తమ విధానంలో మార్పు వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు. మొత్తానికి శివసేనను ఒంటరి పోరుకు పోకుండా.. ఆపితే.. అది అమిత్ షాకు.. బీజేపీకి ప్లస్ పాయింటే.
ఆ తర్వాత బీహార్ మిత్రపక్షం జేడీయూతో అమెత్ షా చర్చలు జరపనున్నారు. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇటీవలి కాలంలో మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ… బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందడానికి ఒత్తిడి పెంచడానికే అలా చెబుతున్నారని.. ఆయన కూటమి నుంచి బయటకు పోరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ ను కూడా.. అమిత్ ఎలాగోలా బుజ్జగిస్తే.. ఎన్డీఏ అస్థిత్వం అయినా నిలబడుతుంది.