తెలంగాణలో పార్టీ విస్తరణపై భాజపా ప్రత్యేక దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, నాయకుల చేరికలు, సభ్యత్వ నమోదు అంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడే సందడి చేశారు. అయితే, మిగతా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను అమిత్ షా చూడ్డం లేదని అర్థమౌతోంది. ఇక్కడ మరింత శ్రద్ధ పెట్టనున్నారు! ఇకపై నెలకోసారి అమిత్ షా హైదరాబాద్ వస్తారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి కదా, ఆయనకి అంత తీరక ఉంటుందా అంటే, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రతీనెలా అమిత్ షా పర్యటన ఉంటుందనీ, ఈ సమయంలో పార్టీ విస్తరణ కార్యక్రమాలతోపాటు తెలంగాణ ప్రజల సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి విశ్లేషణలు చేస్తారని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలకు ఇక నిద్ర పట్టదన్నారు లక్ష్మణ్.
కేంద్ర పథకాలను కేసీఆర్ అమలు చేయడం లేదనీ, ఇకపై వాటిపై అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ పెడతారని లక్ష్మణ్ చెప్పారు. దీంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను భాజపా ప్రశ్నిస్తుందనీ, తెరాస మీద విమర్శలు చేస్తుందని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా రాలేదని విమర్శించడం సరికాదనీ, కేంద్రం సాయం అందకపోతే అది పూర్తయ్యేది కాదన్నారు లక్ష్మణ్. మిషన్ భగీరథను ప్రధాని కాపీ చేశారని కేటీఆర్ అంటున్నారనడం అర్థం లేనిదన్నారు. గతంలో గుజరాత్ లో అమల్లో ఉన్న పథకాన్ని కాపీ చేసిందే కేసీఆర్ కదా అని ప్రశ్నించారు.
మొత్తానికి, రాష్ట్రంలో ఇకపై అన్ని అంశాలపైనా భాజపా మాట్లాడేందుకు బేస్ సిద్ధం చేసుకుంటోంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటూ ఏదీ బలంగా లేదు. ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా తెరాస చేసింది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలనూ ఆకర్షించి, ఏకంగా సీఎల్పీని విలీనం చేసేసింది. దీంతో, తెరాస మాటకు అసెంబ్లీలో తిరుగు ఉండకూడదు అనే పంతాన్ని సీఎం కేసీఆర్ నెగ్గించుకున్నారు. ఓరకంగా ఈ వైఖరే ఇప్పుడు భాజపాకి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. తెలంగాణలో ఇకపై ప్రతిపక్ష పాత్రను పూర్తిస్థాయిలో పోషించేందుకు భాజపా సిద్ధమౌతోంది. అంటే, రాష్ట్రంలో కేంద్రమే ప్రతిపక్ష పాత్రకు రెడీ అవుతున్నట్టే. మరి, ఈ పరిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.