భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 29,30 తేదీలలో తెలంగాణా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. మళ్ళీ జూన్ మొదటి వారంలో మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తారు. మోడీ ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తిచేసుకొన్న సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో భాజపా అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతోంది. వాటిలో పాల్గోనేందుకే అమిత్ షా తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఆ కార్యక్రమాలలో రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో ఒకసారి, జూన్ మొదటివారంలో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. దక్షిణాదిన పార్టీ ఎదగడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అవకాశం ఉందని కమల దళం భావిస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలనుగురువారం నుంచి జూన్ 15 దాకా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అమిత్షా ముందుగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. జూన్ మొదటి వారంలో రెండోసారి రాష్ట్రానికి వస్తారు. జూన్ నెలలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యటించే అవకాశాలున్నాయి.
భాజపాకు బొత్తిగా పట్టులేని అసోం రాష్ట్రంలో గట్టిగా కృషి చేసి అధికారంలోకి రాగలగినప్పుడు, మంచి పట్టు ఉన్న ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాత్రం ఎందుకు రాలేమనే ఆలోచన భాజపా నేతల్లో కలగడంతో మోడీ ప్రభుత్వానికి రెండేళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని, గ్రామస్థాయి వరకు అనేక ప్రచార కార్యక్రమాలు రూపొందించుకొని అమలుచేయడం ద్వారా ప్రజలకు చేరువ అవ్వాలని యోచిస్తున్నారు.
భాజపా ఆలోచన సరైనదే కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి. తెలంగాణాలో నేటికీ భాజపా బలంగానే ఉంది కానీ తెరాస దాని కంటే చాలా బలపడింది కనుక దాని ధాటికి భాజపా తట్టుకోలేక బలహీన పడినట్లు కనిపిస్తోంది. తెరాసను తట్టుకొని నిలబడాలంటే రాష్ట్ర నేతలు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడమే అందుకు మార్గం. అయితే రాష్ట్రంలో తెరాస తప్ప మరో పార్టీ ఏదీ ఉండకూడదని భావిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో భాజపా బలపడే ప్రయత్నాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోంటారనుకోలేము. అప్పుడు దానిని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించవచ్చు. కనుక ముందుగా ఆయనను కట్టడి చేయవలసి ఉంటుంది. అది సాధ్యమో కాదో భాజపాయే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ఇక ఏపిలో తెదేపాతో కలిసి కొనసాగుతున్నప్పటికీ ఆ రెండు పార్టీల మద్య సఖ్యత ఉండటం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. తెదేపాతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపైనే భాజపాకి స్పష్టత లేదు. కనుక ముందు దానిపై స్పష్టత వస్తే దానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందించుకోవడానికి వీలవుతుంది.