భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెల 3వ వారంలో తెలంగాణాలో పర్యటించబోతున్నట్లు కొత్తగా నియమించబడిన రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ప్రకటించారు. అమిత్ షా పర్యటన తేదీ ఖరారు కాగానే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకే ఆయన పర్యటించబోతున్నారని డా. లక్ష్మణ్ చెప్పారు. పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన రాజా సింగ్ ని మళ్ళీ సాధారంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొందరు నేతలను, కార్యకర్తలతో తను స్వయంగా మాట్లాడి అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.
ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి అమిత్ షా తెలంగాణా పర్యటన. మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని వ్యతిరేకించి పార్టీకి దూరమయిన వారిని మళ్ళీ పార్టీతో మమేకం చేయడం.
ఏడాదికో రెండేళ్ళకో ఓసారి అమిత్ షా పర్యటించి వెళ్ళినంత మాత్రాన్న రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా బలోపేతం అయిపోతుందనుకొంటే, ఈపాటికి దేశంలో అన్ని రాష్ట్రాలలో భాజపాయే తిరుగులేని రాజకీయ శక్తిగా ఉండేది. ఆయన పర్యటనతో రాష్ట్ర పార్టీ నేతల మధ్య కొంత సమన్వయం, కార్యకర్తలలో నూతనోత్సాహం కలగడానికి మాత్రమే తోడ్పడుతాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీలో అంతర్గతంగా ఏవయినా సమస్యలున్నట్లయితే అవి కొంత మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనలో పరిష్కరించబడవచ్చును. అలాగే అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఇవే జరుగవచ్చు. ఆ తరువాత అందరూ కలిసి బహిరంగ సభలో మోడీ భజన ఎంత గట్టిగా చేసినప్పటికీ, తెలంగాణా ప్రజలపై తెరాస ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేరు.
ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని స్వయంగా కితాబులు ఇస్తుంటే, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు వంటి కేంద్రమంత్రులు తెరాస నేతలతో రాసుకుపూసుకు తిరుగుతుంటే ఇంకా తెరాస పాలన బాగోలేదని, దానితో మాకు పడదని భాజపా ఏవిధంగా ప్రజలకు నచ్చ చెప్పగలదు? ఆంధ్రప్రదేశ్ లో తెదేపా ప్రభుత్వం పట్ల కూడా భాజపాలో ఇదేరకమయిన అయోమయం నెలకొని ఉండటం గమనించవచ్చు. ఇప్పుడది తెలంగాణాకు కూడా వ్యాపించినట్లుంది.
డా. లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక కాగానే పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంచి సంకేతాలే ఇస్తున్నారని చెప్పవచ్చును. పార్టీని వీడిపోయిన రాజా సింగ్ ని ఆహ్వానిస్తానని చెపుతున్నారంటే, రాజా సింగ్ వెళ్లిపోవడం ఆయనకి కూడా ఇష్టం లేదని అర్ధమవుతోంది. కానీ కిషన్ రెడ్డితో విభేదాలు వద్దనుకోవడం చేతనే మౌనం వహించినట్లు భావించాల్సి ఉంటుంది. నాగం జనార్ధన్ రెడ్డి వంటి నేతలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. బహుశః వారు కూడా కిషన్ రెడ్డి వైఖరి నచ్చకనే దూరంగా ఉంటున్నారేమో? అటువంటి వారిని అందరినీ దరి చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ పైన చెప్పుకొన్న నేపధ్యంలో, ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులలో అది ఎంతవరకు సాధ్యం? వేచి చూడాల్సిందే.