భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంపై మీడియాలో వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ బీజేపీ విభాగానికి నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన సమావేశం కావడంతో అందరిలోనూ ఈ మీటింగ్ పట్ల ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం గురించి తెలుగు మీడియాలో తలా ఒకరకమైన కథనం రావడం విశేషం. తెలుగుదేశం పార్టీకి అనుకూలం గా నిలిచే మీడియా వర్గం ఒక మాట, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక మరో మాట చెప్పింది.
అది కూడా తెలుగుదేశం పార్టీపై బీజేపీ వ్యూ గురించి భిన్నమైన కథనాలు వచ్చాయి. ముందుగా తెలుగుదేశం అనుకూల వాణిని వినిపిస్తుందనే పేరును కలిగిన ‘ఆంధ్రజ్యోతి’ ని పరిశీలిస్తే.. తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టవద్దు అని అమిత్ షా బీజేపీ శ్రేణులకు ఉద్భోదించారని పేర్కొన్నారందులో. తెలుగుదేశాన్ని మిత్రపక్షంగా భావించాలని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పడేలా మాట్లాడవద్దని షా బీజేపీ ఏపీ నేతలకు చెప్పారని ఈ పత్రికలో పేర్కొన్నారు. దీని ప్రకారం షా తెలుగుదేశానితో సంబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చాడని అనుకోవాల్సి వస్తోంది.
ఇక ఇదే సమయంలో ‘సాక్షి’ ని పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరే వారిని కూడా పార్టీలోకి చేర్చుకోవాలని షా బీజేపీ నేతలకు చెప్పినట్టుగా ఈ పేపర్ లో పేర్కొన్నారు. పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని.. దీని కోసం పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలని.. ఆఖరికి ఎవరైనా తెలుగుదేశంనేతలు.. బీజేపీ లోకి వచ్చి చేరతామంటే, వారిని కూడా చేర్చుకోవాలని షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారని ఈ పత్రికలో పేర్కొన్నారు. మరి తెలుగుదేశం నేతలను బీజేపీలోకి చేర్చుకోవడం అంటే.. ఆ పార్టీతో తగాదా పెట్టుకోవడమే. మిత్రబేధం మొదలైనట్టే.
మొత్తానికి రెండు తెలుగు పత్రికల్లో అమిత్ షా మీటింగ్ గురించి రెండు పరస్పర విరుద్దమైన కథనాలు ప్రచురితం అయ్యాయి. వీటిలో ఏది నిజమో!