రాజకీయ వ్యూహకర్తల్లో ప్రశాంత్ కిషోర్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పలు సందర్భాల్లో అమిత్ షా ఆయనను తీసి పడేశారు. ప్రశాంత్ కిషోర్ మాత్రం అంత అధికారం చేతిలో పెట్టుకుని గెలుపు వ్యూహాలు రచించడం గొప్పా అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వీరిద్దరూ నేరుగా ఒకే రాష్ట్రంలో తలపడే పరిస్థితి కనిపిస్తోంది. అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్ తరపున వ్యూహకర్త బాధ్యతలను.. తీసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు.
గుజరాత్ ఎన్నికల విషయంలో కలిసి పని చేసేందుకు రాహుల్ గాంధీని ప్రశాంత్ కిషోర్ కలిసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది గుజరాత్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకోవడానికి ఆసిక్తగా చూపుతున్నట్లు సమాచారం. తుది అభిప్రాయం మాత్రం రాహుల్ గాంధీదేనని చెబుతున్నారు. ఈ విషయంలో గుజరాత్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ మన్నించే అవకాశాలు ఉన్నాయి. ఒప్పందం జరిగితే.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం అక్కడ కూడా రంగంలోకి దిగే అవకశం ఉంది.
బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తరపున వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్… విజయం సాధించిన తర్వాత ఇక తాను వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే పలు కారణాలతో చేరలేదు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ప్రారంభించారు. కానీ గుజరాత్ విషయంలో మాత్రం కాంగ్రెస్‌కు ఫేవర్ చేయడానికి ఆయన రెడీగా ఉండే అవకాశం ఉంది. గుజరాత్లో పనిచేయడాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా చాలెంజింగ్‌గా తీసుకుంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా… తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. మోడీ, అమిత్ షాల కంటే తానే తెలివైన వ్యహకర్తను అని నిరూపించుకునే క్రమంలో గుజరాత్లో కాంగ్రెస్ విజయాన్ని చాలెంజింగ్‌గా తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మాత్రం పీకే … తిరుగులేని స్థానాన్ని దేశ రాజకీయాల్లో సంపాదించుకుంటారు.