తాజాగా మరొకసారి భారతదేశంలో ” భాషా వివాదం” రాజకుంది. అమిత్ షా నేతృతంలో కొనసాగుతున్న అధికార భాష కొరకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్ (Parliamentary committee on official language) సమావేశాలలో భాగంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించగా, తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. వివరాల్లోకి వెళ్తే..
అమిత్ షా వ్యాఖ్యలు ఏంటి? స్టాలిన్ ప్రతిస్పందన ఏంటి?
భారతదేశంలో ఉపయోగించాల్సిన అధికార భాషను ఎంపిక చేయడం కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, కాలక్రమేణా భారతదేశం యావత్తూ హిందీ వినియోగాన్ని అంగీకరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ, పురోగతి అయితే తప్పకుండా ఉందని వ్యాఖ్యానించారు. అయితే భారతదేశంలోని ఇతర భాషలకు హిందీ పోటీ కాదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. తమ మీద హిందీ రుద్దే ప్రయత్నాలను అంగీకరించబోమని, మేము మీకు బానిసలు కాము అని వ్యాఖ్యానించిన స్టాలిన్, తమిళనాడు తో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సైతం దీని పై వస్తున్న వ్యతిరేకత ని గమనించాలని, 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ పరిస్థితులను తిరిగి తీసుకురావద్దని హితవు పలికారు.
భారతదేశానికి జాతీయ భాష ఏది ? అధికారిక భాష ఏది?
చాలామందికి జాతీయ భాషకు అధికార భాషకు తేడా పెద్దగా తెలియకపోవచ్చు. జాతీయ భాష అన్నది ఆ దేశ చరిత్ర, వారసత్వ సంపద మరియు సంస్కృతి ఆధారంగా ఆ దేశ రాజ్యాంగం లేదా ప్రభుత్వం నిర్ణయించుకున్న భాష. అధికార భాష అన్నది ప్రభుత్వంలోని వేరువేరు విభాగాలకు సంబంధించి అధికారికంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి అనుమతించిన భాష. ఇవి రెండూ ఒకటే కానవసరం లేదు. ఉదాహరణకు సింగపూర్ జాతీయ భాష మలై అయితే అధికారిక భాషలుగా మలై తో పాటు మాండరిన్, ఇంగ్లీష్ మరియు తమిళ్ కూడా ఉన్నాయి. భారతదేశం విషయానికి వస్తే ఒక జాతీయ భాష అంటూ ఏది నిర్ణయింపబడలేదు కానీ 22 భాషలను అధికారిక భాషలుగా రాజ్యాంగం గుర్తిస్తూ ఉంది. వీటిలో హిందీ కూడా ఒక భాష మాత్రమే. అయితే కాలక్రమేణా జాతీయ సమైక్యతను పెంపొందించడానికి హిందీ భాషను మాత్రమే అధికార భాషగా ఉండేలా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలే ప్రస్తుత గొడవకు కారణం.
స్వాతంత్రానికి పూర్వం నుండే ప్రారంభమైన జాతీయ భాష వివాదం:
బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశానికి ఇంగ్లీష్ మాత్రమే అధికార భాషగా ఉండేది. అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ తమ కార్యక్రమాలను, చర్చలను బ్రిటిష్ వారి ఇంగ్లీషులో కాకుండా హిందీలో జరపడానికి నిర్ణయాలను చేసింది. 1918 లోనే మహాత్మా గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లోనే తమిళనాడుకు చెందిన రామస్వామి నాయకర్ వంటి నేతలు దీనిని వ్యతిరేకించారు. కానీ రాజగోపాలాచారి వంటి తమిళనాడు నేతలు హిందీ భాష కి మద్దతు ఇవ్వడమే కాకుండా 1937లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందీని మద్రాస్ రెసిడెన్సి (అంటే ప్రస్తుత తమిళనాడు మరియు ఆంధ్ర తదితర ప్రాంతాల లో) తప్పని సరిగా బోధించాలంటూ జీవో తీసుకొచ్చారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈ జీవో కూడా అటకెక్కింది.
ఒక్క ఓటు: రాజ్యాంగం వ్రాసేటప్పుడూ ఇదే సమస్య:
స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే సమయంలో కూడా ఇదే సమస్య వెంటాడింది. మన రాజ్యాంగ నిర్మాతలు సైతం ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకోలేక ఓటింగ్ నిర్వహించారు. కేవలం ఒకే ఒక్క ఓటు ఆధిక్యత తో హిందీ అధికార భాషగా నిర్ణయించబడింది. అయితే రాజ్యాంగం ఏర్పాటైన నాటి నుండి 15 సంవత్సరాల వరకు అంటే 1965 వరకు ఇంగ్లీష్ కూడా అనుబంధ భాషగా అధికారికంగా కొనసాగుతుందని రాజ్యాంగం నిర్ణయించింది.( ఆర్టికల్ 343).
1965 హిందీ వ్యతిరేక ఉద్యమం ఏంటి:
1950లో రాజ్యాంగం అమలులోకి రాగా 1959 నాటి నుండే దక్షిణ భారతదేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 1965 నాటికి 15 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి ఇంగ్లీషు కొనసాగించడాన్ని ఆపేసి పూర్తిగా హిందీలో మాత్రమే అధికార భాషగా నిర్ణయిస్తే విద్య ఉద్యోగాల పరంగా, భవిష్యత్తు పరంగా, ఉనికి పరంగా తాము ఎంతగానో కోల్పోతామని హిందీయేతర భాషల ప్రజలలో ఆందోళన మొదలైంది. అయితే 1959లో అప్పటి ప్రధాని నెహ్రూ హిందీని, హిందీయేతర రాష్ట్రాల ప్రజలపై రుద్దబోము అని హామీ ఇచ్చారు. అంతేకాక 1963 లో అధికారిక భాష చట్టాన్ని తీసుకువచ్చి 1965 తర్వాత కూడా ఇంగ్లీష్ వాడుక సాఫీగా కొనసాగడానికి బాటలు వేశారు. అయితే ఈ చట్టం తమకు అనుకూలంగానే ఉన్నప్పటికీ చట్టంలోని కొన్ని సూక్ష్మమైన అంశాల లో స్పష్టత లేకపోవడం, భవిష్యత్తు ప్రభుత్వాలు మరొక రకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆస్కారమిచ్చే అంశాలు చట్టం లో ఉండడం వంటి వాటి కారణంగా 1965లో తమిళనాడు లో హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. అనేకమంది ఆత్మాహుతి కావడం, హింసాత్మక చర్యలు జరగడం వంటి పరిణామాలతో పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపించగా అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, హిందీయేతర రాష్ట్రాలు కోరేంతవరకు ఇంగ్లీష్ అధికార భాషగా కొనసాగుతుందని హామీ ఇవ్వడంతో ఉద్యమం ముగిసిపోయింది.
మరి తాజా గా అమిత్ షా స్టాలిన్ మధ్య మాటల యుద్ధానికి కారణమైన ఈ కమిటీ ఏంటి?
1963 లో వచ్చిన అధికార భాష చట్టం హిందీ తో పాటు ఇతర భారతీయ భాషలను కూడా అధికారిక భాషలుగా గుర్తించింది. వీటిలో ఆయా రాష్ట్రాల కి అనుగుణమైన భాషలో అధికారిక కమ్యూనికేషన్స్ జరుపుకోవాలని ప్రతిపాదించింది. అయితే భారతదేశంలో హిందీ వాడుక ప్రోత్సహించడానికి, అధికారిక కార్యక్రమాలలో హిందీ మాత్రమే ఉపయోగించగలిగే దిశగా పరిస్థితులు ఏర్పాట అయ్యేంతవరకు పురోగతి ని సమీక్షిస్తూ ఉండడానికి 1976 లో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కేంద్ర హోం మంత్రి నేతృత్వంలో నడుస్తుంది… నడుస్తూనే ఉంటుంది. అయితే గత ఏడాది ఈ పార్లమెంటరీ కమిటీ కొన్ని సూచనలను సమర్పించింది. ఐఐటి , ఐఐఎం, కేంద్రీయ విద్యాలయ , నవోదయ వంటి సంస్థలలో ఇంగ్లీష్ బదులుగా హిందీలో బోధించాలి అంటూ ప్రతిపాదన చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇంగ్లీష్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించి, హిందీ ప్రాధాన్యాన్ని పెంచాలంటూ సూచనలు చేసింది. సహజంగానే తమిళనాడు మరియు కేరళ ముఖ్యమంత్రులు ఈ సూచనలను ఖండించారు. 1976 నుండి ఈ కమిటీ కొనసాగుతూ ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ అంశంపై పురోగతి కనిపిస్తూ ఉంది.
రాజకీయ కోణం:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో హిందీ రాష్ట్రాలకు మేలు చేసే విధంగా చేయడం ద్వారా హిందీ రాష్ట్రాల లో తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తక్షణమే హిందీని బలవంతంగా రుద్దకపోయినప్పటికీ హిందీయేతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు వారి ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి అంటూ బిజెపి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
ముగింపు:
భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే కాకుండా, అనేక ఇతర పొరుగు దేశాల కంటే మెరుగైన రాజకీయ సుస్థిరతను, ఆర్థిక సుస్థిరతను సాధించిన భారతదేశం లో జాతీయ సమైక్యత అన్నది కేవలం భాష వినియోగం అన్న ఒక్క అంశంపై ఆధారపడి ఉంటుందనుకోవడం అమాయకత్వం. విభిన్న అధికారిక భాషలు కలిగినంత మాత్రాన దేశ సమైక్యతకు వచ్చిన భంగం కూడా ప్రస్తుతానికి ఏమీ కనిపించడం లేదు. కాబట్టి హిందీ వినియోగాన్ని పెంపొందించే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ, హిందీయేతర భాషల ప్రజలకు భరోసా ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సుస్థిరతకు, సమైక్యతకు *శ్రీరామ” రక్షగా ఉంటుంది.