కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రి పదవి.. అదీ అమిత్ షాకు ఉన్న ఇద్దరు డిప్యూటీల్లో ఒకరిగా ఉండే అవకాశం పొందిన ఆనందంలో కిషన్ రెడ్డి వేసిన మొదటి అడుగే … తలంటేలా చేసింది. హోంశాఖ సహాయమంత్రిని కాబట్టి తాను ఏం అన్నా చెల్లిపోతుందనుకున్నారేమో.. మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ.. హైదరాబాద్ ఇమేజ్ పై మరకపడేలా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని… ప్రకటించేశారు. ఇది.. జాతీయ మీడియాలో హైలెట్ అయింది. కిషన్ రెడ్డి స్టేట్ మెంట్ గురించి తెలుసుకున్న అమిత్ షా… వెంటనే… ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతగా చేసే ప్రకటనలకు.. కేంద్రమంత్రిగా చేసే ప్రకటనలకు తేడా చూసుకోాలని హెచ్చరించారు. ఇలాంటి సున్నితమైన విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా మాట్లాడేటప్పుడు.. ముందూ వెనుకా చూసుకోవాలని ఆదేశించినట్లు.. బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి హైదరాబాద్ ఉగ్గవాదుల అడ్డా గురించి మాట్లాడలేదు.
అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల రెస్పాన్స్.. రావాల్సిన దగ్గర్నుంచే వచ్చింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కిషన్ రెడ్డి స్టేట్మెంట్పై ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డికి హైదరాబాద్ అంటే ఇష్టం లేదని.. అందుకే లేనిపోని ఆరోపణలు చేసి.. హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడెక్కడ ఎక్కువగా ఉగ్రవాదులు పట్టుబడ్డారో లెక్కలు తీయాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా.. టెర్రరిస్టులు పట్టుబడ్డారని.. అందుకే ఆ రాష్ట్రాన్ని ఉగ్రవాద రాష్ట్రంగా పిలుద్దామా అని ప్రశ్నించారు. దీంతోనే సరిపెట్టలేదు.. మూడు వందల సీట్లు గెలిస్తే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులు చేస్తారా..? అని మండిపడ్డారు.
కిషన్ రెడ్డి.. ఇప్పటి వరకూ.. ఎలాంటి ప్రభుత్వంలోనూ భాగం కాలేకపోయారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఈ సారి మాత్రం నేరుగా కేంద్రమంత్రి వర్గంలోకి వెళ్లే అవకాశమే దక్కింది. దాంతో… ఆయన అధికార పరిమితులు… స్టేట్మెంట్ల విషయంలో.. జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఇతర మంత్రిత్వ శాఖలో ఉండి.. ఇలాంటి విమర్శలు చేస్తే… రాజకీయాల్లో భాగమని అనుకునేవారేమో కానీ.. కీలకమైన హోంశాఖకు సహాయమంత్రిగా ఉండి.. హైదరాబాద్ ఇమేజ్ పై మచ్చ పడేలా వ్యాఖ్యానించడంతో వ్యవహారం రివర్స్ అయింది. దాంతో కేంద్రమంత్రిగా తొలి అడుగులోనే పెద్ద పాఠం నేర్చుకున్నట్లయింది.