కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మరోసారి చివాట్లు తిన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారంటూ, ఉగ్రవాదులు ఎక్కువయ్యారంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి అప్పట్లో హోంమంత్రి అమిత్ షా ఆగ్రహాన్ని చవి చూశారు. మళ్లీ తాజాగా తెలుగు ప్రజలకు ఎర్ర బస్సు తప్ప ఇంకేం తెలియదంటూ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా అక్షింతలు వేసినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీని మరింత ఇబ్బందులు పాలు చేసేలా వ్యాఖ్యలు చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు చెబుతున్నారు. పాలకులపై ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేయడం తప్పు కాదని, దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను అవమానం పాలు చేయడం శృతి మించినట్లు అవుతుందని అమీత్ షా అన్నట్లు సమాచారం. తెలుగు ప్రజలకు ఎర్రబస్సు తప్ప మరేమీ తెలియదంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్ము దులుపుతున్నారు. తెలుగు ప్రజలకు ఎర్రబస్సు తప్ప తెలియదు అంటే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావ్..? అంటూ కొందరు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలుగు ప్రజలకు ఏమీ తెలియకుండా పోయింది అంటూ మరికొందరు సోషల్ మీడియా సాక్షిగా కిషన్ రెడ్డి ఆడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్ లో తీవ్రస్థాయిలో మందలించినట్లు చెబుతున్నారు. “మీరు హోం మంత్రి అయినంత మాత్రాన అన్నీ మీకు తెలుసు అనుకుంటున్నారా?. నీకంటే ప్రజలకు బాగా తెలుసు. వారి వల్లే మీరు ఇక్కడ కూర్చున్నారు. అది గుర్తుంచుకోండి” అని అమిత్ షా మందలించినట్లు సమాచారం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు
కూడా అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి పటిష్ట పరచాలనుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.