బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించే విషయంలో భారతీయజనతాపార్టీ త్రిముఖ వ్యూహం పాటించింది. పార్టీ అధ్యక్షుడు అమత్ షా దగ్గరుండి పార్టీ టికెట్లు పంపిణీ చేశారు. ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజేపీ తన వాటాగా 160 సీట్లులో పోటీచేయాలి. ఇప్పటికే 154 మంది అభ్యర్థులను పార్టీ ఇంచుమించు ఖరారుచేసింది. సీట్ల పంపిణీలో పార్టీ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంది. 1. అభ్యర్థులను కేవలం గెలుపు గ్యారంటీ ప్రతిపాదికన ఎంపిక చేయడం. 2. కుల ప్రాతిపదికన టికెట్లు ఇవ్వడం, 3. వయస్సును లేదా సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని సీట్లు అప్పజెప్పడం. అయితే, అభ్యర్థులను ఎంపికచేసే విషయంలో అమిత్ షా ఎక్కడా విద్యాసంపన్నుల విషయం పట్టించుకున్న దాఖలా లేదు.
ఈ త్రిసూత్రాలను పాటిస్తూ అభ్యర్థులను ఎంపికచేయడంతో దాదాపు 65 సీట్లకు పైగా అగ్రకులాలవారు చేజిక్కించుకున్నారు. రాజపుత్రులు 30, భూమిహార్లు 19, బ్రాహ్మణులు 13, కయస్తాలు మూడు చోట్ల టికెట్లు సంపాదించుకున్నారు. ఇక యాదవులు 22, ఆర్థికంగా వెనుకబడిన వైశ్యవర్గానికి చెందినవారికి 20, ఆర్థికంగా వెనకబడిన ఇతర కులాలవారికి 13, మహాదళితులకు, ఆదివాసీలకు కలిపి 12మందికీ, పాశ్వాన్లకు పది సీట్లు పంచిపెట్టగా, మిగిలిన వాటిలో కుశ్వాహాలకు ఆరు, కుర్మిలకు నాలుగు, ముస్లీంలకు రెండు సీట్లు ఇచ్చారు.
బిజేపీ సీట్లను కేటాయించేటప్పుడు అభ్యర్థుల నేపథ్యం, వారి ఆర్థిక స్థితి, సంఘ్ పరివార్ తో వారికున్న బంధం వంటివాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. పార్టీ అభ్యర్థులను ఎంపికచేసేటప్పుడు అమిత్ షా క్షేత్ర స్థాయిలో నాయకుల సేవలను కూడా పరిగణలోకి తీసుకోవడమన్నది అభినందించదగ్గ విషయం. ఈసారి బిహార్ ఎన్నికల్లో తమ కూటమిలో ఉన్న పాశ్వాన్, ముసాహర్ వర్గాలు (రాంవిలాస్ పాశ్వాన్, జితన్ రాం మాంఝీ) ఎలాగో వారివారి పార్టీల ద్వారా 60సీట్ల దాకా దళితులకు ఇస్తూ న్యాయం చేస్తుండటంతో బిజేపీ తన దళితుల, ఆర్థికంగా వెనుకబడినవారి ఖాతాను 21కి కుదించేసింది.
అమిత్ షా ఎంత జాగ్రత్తగా సీట్ల పంపిణీ చేసినప్పటికీ విమర్శలు తప్పలేదు. బిహార్ లోని వివిధ జిల్లాలకు చెందిన వందమంది కార్యకర్తలు ఢిల్లీలోని బిజేపీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని తమ నిరసన తెలిజేయడాన్నిబట్టి అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అయితే వారి వాదనను అమిత్ షా చాలా శ్రద్దగా విని, ఆ తర్వాత తనదైన శైలిలో సర్ది చెప్పేశారు. ప్రస్తుతానికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందికనుక ఇప్పుడు తప్పొప్పులు గురించి మాట్లాడుకోవడం తగదని హితవు పలికారు. మీమీ నియోజకవర్గాలకు వెళ్ళి పార్టీతరఫున ప్రచారం చేయాల్సిందిగా కూడా ఆయన వారిని కోరారు. ఆ తర్వాత చాలా స్నేహపూర్వక వాతావరణంలో వారితో కలిసి సెల్ఫీలు దిగారు. దీంతో బిహార్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమాప్తం.
కుల రాజకీయాలు తగదని ఎంతమంది అంటున్నా ఈ దేశాన్ని పాలించేదీ, శాసించేది కులమే అన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీనే బిహార్ అభ్యర్థుల ఎంపిక ద్వారా ఢంక భజాయించి మరీ చాటిచెప్పినట్లయింది. అయినప్పటికీ, బిహార్ మొత్తం ఓటర్లలో 30శాతం మంది కులాలను పట్టించుకోకుండా ఓట్లు వేసే అవకాశాలులేకపోలేదు. ఈ అంశాన్ని బిజేపీ కూడా మరచిపోలేదు. అయితే, అందుకే మోదీ ఆకర్షణ ఉపయోగించుకుంటూ మెజారిటీ స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేయాలన్నది బిజేపీ వ్యూహం. మరో విషయమేమంటే, ప్రధాన ప్రత్యర్థులైన నితీశ్, లాలూ ఎలాంటి అభ్యర్థులను నిలబెడతారన్న ఫ్యాక్టర్ కూడా తమ గెలుపుఓటమిలపై ప్రభావం చూపుతుందని బిజేపీ భావిస్తోంది.
– కణ్వస