భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు.. అమిత్ షా.. శుక్రవారం అంటే పదమూడో తేదీన… తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పార్టీ బూత్ లెవన్ ఇన్చార్జులతో పాటు.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో కూడా సమావేశం అవుతారు. ఇదంతా పార్టీ కార్యక్రమం. కానీ ఆయన తమ ప్రభుత్వ విజయాలను వివరించి.. వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ.. ముగ్గురు ముఖ్యులను.. “సంపర్క్ ఫర్ సమర్థన్..” పేరుతో కలవనున్నారు. వారు ముగ్గురు ఎవరో కాదు.. మీడియా మొఘల్ రామోజీరావు, టీవీ9 యజమాని శ్రీనిరాజు, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.
సంపర్క్ ఫర్ సమర్థన్‌లో భాగంగా.. మొదట ఫిల్మ్ సిటీకి వెళ్లి.. రామోజీరావుతో సమావేశమవుతారు. ఆ తర్వాత గచ్చిబౌలిలో సైనా నెహ్వాల్‌ను కలుస్తారు. చివరిగా జూబ్లీహిల్స్‌లో శ్రీనిరాజుతో సమావేశం అవుతారు. వీరిలో రామోజీరావుది… మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక విధానం కాబట్టి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన అదే విధానం కొనసాగించే అవకాశం ఉంది. మరి ప్రత్యేకంగా సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో కలవడం ఎందుకో బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. ఇక సెలబ్రిటిగా సైనా నెహ్వాల్‌ను ఎంపిక చేసుకోడానికి ఆమె ఉత్తరాది నేపధ్యం కారణం కావొచ్చంటున్నారు. ఇక మీడియా రంగంలోనే మరో ముఖ్యుడిని అమిత్ షా ఎంచుకున్నారు. టీవీ 9 ..యజమాని శ్రీనిరాజును.. ప్రత్యేకంగా మీడియాను మంచి చేసుకోవడానికి కలుస్తున్నారని భావించొచ్చు. కానీ టీవీ9 మద్దతు కావాలంటే.. టీఆర్పీలు వచ్చేలా బీజేపీ నేతలు సర్కర్ వేషాలు వేయాల్సిందేని…ఆ పార్టీ నేతలే జోకులేసుకుంటున్నారు.
దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణపై కొంచెం ఎక్కువే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తోంది. కత్తి మహేష్ ఎపిసోడ్‌ను ఉపయోగించుకుని ప్రజల్లో హిందూత్వ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పైగా అమిత్ షా .. హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారాన్ని కూడా.. మెల్లగా పెంచుకుంటూ పోతున్నారు. అమిత్ షా పోటీ చేస్తే మరింత ఊపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో ఒక్క రోజు పర్యటన తర్వాత అమిత్ షా ఢిల్లీ వెళ్లిపోతారు. మరి ఏపీలో సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో.. అసలు ఉంటుందో.. ఉండదో కూడా.. బీజేపీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి.