రాజమండ్రిలో నిన్న బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వమని చెప్పారు.
అయితే గత 22 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిలు అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడిని, కేంద్రమంత్రులని కలిసి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయమని ఎన్నిసార్లు వేడుకొన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూనే ఉన్నారు. ఆ సంగతి అమిత్ షా కూడా గ్రహించారు కనుకనే తాము రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని నిన్న సభలో చెప్పుకోవలసి వచ్చింది లేకుంటే ఆ ప్రసక్తే చేయవలసిన అవసరమే ఉండేది కాదు. ఒకపక్క రాష్ట్రం పట్ల ఇంత చులకనగా వ్యవహరిస్తూనే మళ్ళీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని ఆయన చెప్పడం రాష్ట్ర ప్రజలను అపహాస్యం చేయడమే.
తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయని కారణంగానే రాష్ట్ర ప్రజలలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని, అది క్రమంగా పెరుగుతోందని కూడా ఆయన గ్రహించేరు. అందుకే ఆయనతో సహా నిన్న సభలో మాట్లాడిన బీజేపీ నేతలు అందరూ కూడా హామీలన్నిటినీ తప్పకుండా అమలుచేస్తామని అంత గట్టిగా నొక్కి చెప్పుకోవలసి వచ్చింది. అన్నీ తెలిసి ఉన్నప్పటికీ వారు యధాప్రకారం తమ వాదనను బలంగా వినిపించే ప్రయత్నాలు చేసారే తప్ప తమ తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తామన్నట్లుగా మాట్లాడకపోవడం గమనిస్తే రాష్ట్రం పట్ల వారి (చులకన) వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది.
రాష్ట్రంలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఏర్పడి పెరగడానికి కారణం తమ హామీలను నిలబెట్టుకోలేకపోవడమేనని వారు గ్రహించినప్పటికీ, రాష్ట్రంలో మిత్రపక్షమయిన తెదేపాతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే తమ పార్టీ పట్ల, కేంద్రంపట్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నట్లున్నారు. అందుకే వారు హామీల విషయంలో తమ వైఫల్యాలని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని భావించవచ్చును. అయితే ఇదే విషయాన్ని నిన్న బహిరంగ సభలో బయటకి చెప్పుకొంటే తెదేపాతో తమ సంబంధాలు దెబ్బ తింటాయనే భయంతో చెప్పుకోలేకపోయారు. కానీ గత 22 నెలలుగా రాష్ట్ర బీజేపీ నేతలు సమయం చిక్కినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకొంటూనే ఉన్నారు.
ఆ రెండు పార్టీలు గమనించాల్సిన విషయం ఏమిటంటే వాటి మధ్య ఎటువంటి సంబంధాలున్నాయి…అవి బలంగా ఉన్నాయా లేదా…అనే విషయాలు రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఆ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తున్నాయా లేదా అని మాత్రమే వారు చూస్తున్నారు. ఆ రెండు పార్టీలు హామీలు అమలు చేయకుండా ఈవిధంగా ఒకదానినొకటి నిందించుకొంటూ, హామీలను తప్పకుండా అమలుచేస్తామని మళ్ళీ హామీలు ఇస్తూ, ఆత్మగౌరవానికి భంగం కలిగించమని చెపుతూ మళ్ళీ ప్రజలను అపహస్యం చేస్తూ, మిగిలిన మూడేళ్ళు కూడా ఇలాగే కాలక్షేపం చేస్తే ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినట్లుగానే వాటికి కూడా వచ్చే ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెపుతారని గ్రహిస్తే మంచిది.